కలం, నాగర్‌కర్నూల్: కోడేరు మండలం తీగలపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు కన్నారెడ్డి భాస్కర్ రెడ్డిపై జరిగిన దాడి (Bhaskar Reddy Attack), హత్యాయత్నం ఘటనపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Beeram Harshavardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయన, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను కలిసి ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రతను తగ్గించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ముఖ్యంగా డీఎస్పీ శ్రీనివాస్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కోడేరు పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి భార్య మాట్లాడుతూ.. తన భర్తపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

