కలం, ఆదిలాబాద్: యువత కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, సమయపాలనతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Rajarshi Shah) అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ‘ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్’ సంస్థ ఆధ్వర్యంలో ‘యూత్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్’లో భాగంగా నిర్వహించిన వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో యువత ఉన్నత స్థాయికి ఎదగాలంటే కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విశ్లేషణాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు విలువైన సమయాన్ని వృథా చేయకుండా, చదువుతో పాటు తమలోని అంతర్గత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ‘మనసులను ప్రేరేపిస్తూ.. ఆత్మలను ప్రజ్వలింపజేద్దాం’ అనే స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యువతలో ఆత్మవిశ్వాసం, నూతన ఆలోచనలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమ నిర్వాహకులు, ‘ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్’ ప్రతినిధుల కృషిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లలిత కుమారి, లేబర్ ఆఫీసర్ ముత్యం రెడ్డి, రంజిత్ సుధాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

