ఖమ్మంలో ఖాళీ బిందెల కదం.. కదలని యంత్రాంగం!

కలం, ఖమ్మం బ్యూరో: నగరంలోని ఏడో డివిజన్ పరిధిలో ఉన్న కేసీఆర్ టవర్స్‌లో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యను (Khammam Water Crisis) పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఖానాపురం హవేలీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సమస్యను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు.

​ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ మాట్లాడుతూ గత 12 రోజులుగా దాదాపు 500 కుటుంబాలకు నీళ్లు రాకపోవడంతో ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం లేకపోయినా కొన్ని రోజులు ఉండగలమని, కానీ నీరు లేకుండా 12 రోజులుగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఒకరు అనారోగ్యంతో మరణిస్తే, కనీసం పార్థివదేహానికి స్నానం చేయించడానికి కూడా నీళ్లు లేని దయనీయ పరిస్థితి నెలకొందని విమర్శించారు.

​సమస్యను మూడుసార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని నాయకులు ఆరోపించారు. అధికారులు కంటితుడుపు చర్యగా అప్పుడప్పుడు ఒక ట్యాంకర్ నీటిని పంపిణీ చేస్తే, వందలాది కుటుంబాలకు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. శాస్త్రీయ పద్ధతిలో వాటర్ ట్యాంకులు, బోరు బావులు ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికి మున్సిపల్ కుళాయిల ద్వారా నిత్యం నీరందేలా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఖమ్మం మంత్రి, కమిషనర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో పార్టీ హవేలీ కార్యదర్శి దొంగల తిరుపతిరావు, నాయకులు టి. విష్ణు, పిన్నింటి రమ్య, పోతురాజు వెంకట్, చిలక వెంకటేశ్వర్లు, కేసీఆర్ టవర్స్ స్థానికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>