epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నీళ్ల పేరుతో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ డ్రామాలు : బండి సంజయ్​

కలం కరీంనగర్ బ్యూరో: నీళ్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీలపై చర్చించకుండా, బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ లేకుండా కలసి నాటకాలు ఆడాయని మంత్రి అన్నారు. గురువారం కరీంనగర్​లోని శుభం గార్డెన్స్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ తీరుపై ఉద్యమం చేసింది బీజేపీనే అని గుర్తు చేశారు. తెలంగాణకు అన్యాయం జరగొద్దని అనేక సమావేశాలు కేంద్రం పెట్టిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కృష్ణా జిల్లాల వాటా 811 టీఎంసీలు ఉంటే ఏనాడూ తెలంగాణ 200 టీఎంసీలు మించి వాడుకోకుండా కాంగ్రెస్ అన్యాయం చేసిందని విమర్శించారు. గోదావరిలో 1,486 టీఎంసీల వాటా ఉంటే 500 టీఎంసీలకు మించి రాష్ట్రంలో వాడుకోవడం లేదన్నారు.

‘పాలమూరు’పై సీఎం పచ్చి అబద్ధాలు:

పాలమూరు–రంగారెడ్డి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు ఆడారని బండి సంజయ్ (Bandi Sanjay)​ ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం నిర్మాణంలో, ప్లాన్​లో ఉన్న నీటి ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపవద్దన్నారు. సెక్షన్ 89 ప్రకారం ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు ప్రాజెక్టులు పొందుపరిచారని చెప్పారు. గతంలో కేసీఆర్.. తెలంగాణలో కేసీఆర్ అనే అణుబాంబు ఉందని, చంద్రబాబు ఆటలు సాగనివ్వబోమని పిట్టలదొర మాటలు మాట్లాడాడని అన్నారు. ఏపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయి.. కృష్ణా జలాల్లో తెలంగాణకు 570 టీఎంసీలు వాటా రావాల్సి ఉంటే, 299 టీఎంసీలకే ఒప్పుకొని తీరని అన్యాయం చేశాడని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 4.3 టీఎంసీల నుంచి 13.7 టీఎంసీలకి పెంచినా నోరు మెదపలేదని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం ప్రాజెక్టు కట్టి, రూ.30 వేల కోట్ల వ్యయాన్ని రూ.లక్ష కోట్లకు పెంచి ప్రజాధనాన్ని దోచుకున్న దొంగ కేసీఆర్ అని బండి ఘాటుగా విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>