చంద్రబాబును కలిసిన కూనంనేని.. విలీన గ్రామాలపై విజ్ఞప్తి!

​కలం, ఖమ్మం బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu)ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కలిశారు. పాల్వంచలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే కూనంనేని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భద్రాచలం మండల పరిధిలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడంతో పాటు, స్థానిక ఆలయాల అభివృద్ధికి టీటీడీ ద్వారా రూ.22 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ మూడు వేర్వేరు వినతిపత్రాలను అందజేసి సుదీర్ఘంగా చర్చించారు.

​రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల గ్రామాలకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంతో విడదీయరాని చారిత్రక, సాంస్కృతిక అనుబంధం ఉందని కూనంనేని వివరించారు. వరద ముంపు లేని ఈ ఐదు గ్రామాలను పరస్పర అవగాహనతో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని కోరారు. దీనితో పాటు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి ఏపీ భూభాగంలో ఉన్న భూముల రక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

​పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, మౌలిక వసతుల అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని కూనంనేని (Kunamneni Sambasiva Rao) కోరారు. ముఖ్యంగా పాల్వంచలోని ప్రసిద్ధ శ్రీనివాస గుట్ట ఆలయ సమగ్ర అభివృద్ధి, భక్తుల వసతుల కల్పన కోసం టీటీడీ ద్వారా రూ.12 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. వీటితో పాటు కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోని టీటీడీ కళ్యాణ మండపాల ఆధునీకరణకు ఒక్కో దానికి రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.10 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

​ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ విజ్ఞప్తులపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని కూనంనేని ఆకాంక్షించారు. తమ విజ్ఞప్తులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూనంనేని వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు.

Also Read : కేసీఆర్ పాల‌మూరు బిడ్డ‌ల గుండెల‌పై త‌న్నాడు: సీఎం రేవంత్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>