బండి సంజయ్‌కు మాజీ మేయర్ సవాల్.. 8 పేజీల బహిరంగ లేఖ!

​కలం, కరీంనగర్: “రెండుసార్లు ఎంపీగా గెలిపించి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వంటి కీలక పదవి దక్కినా.. కరీంనగర్ అభివృద్ధికి, తెలంగాణ ప్రయోజనాలకు మీరు సాధించిందేమిటి?” అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ (Bandi Sanjay  Kumar) పై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ (Sardar Ravinder Singh) ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయ విమర్శలు, ప్రకటనలతో కాలం వెళ్లదీయడం కాకుండా, 2019 నుంచి ఇప్పటివరకు పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు, సాధించిన నిధులు, పూర్తయిన ప్రాజెక్టులపై ఆధారాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర మంత్రికి 8 పేజీల సుదీర్ఘ బహిరంగ లేఖను విడుదల చేశారు.

​సొంత పార్టీ అవినీతిపై ద్వంద్వ వైఖరి ఎందుకు?

ఇతరుల అవినీతిపై మాట్లాడే బండి సంజయ్, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల నిర్మాణాల నుంచి వివిధ పనుల వరకు సొంత పార్టీ కార్పొరేటర్లు సాగిస్తున్న వసూళ్ల దందాపై ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. అవినీతికి పాల్పడిన సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటించగలరా అని సవాల్ విసిరారు.

​స్మార్ట్ సిటీ రూ. 17 కోట్ల అక్రమాలపై విచారణేది?

గత ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కృషితో వచ్చిన స్మార్ట్ సిటీ నిధుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఎలాంటి సాంకేతిక ఆమోదాలు లేకుండానే ఎలక్ట్రికల్ పనుల పేరిట రూ. 17 కోట్లకు పైగా చెల్లింపుల ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. దీనిపై బాధ్యులైన అధికారులపై విచారణకు ఎందుకు చొరవ చూపలేదని ప్రశ్నించారు. అలాగే నగర నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్ భూమి కబ్జా, చెత్త తొలగింపు టెండర్ల ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని కోరారు.

​అభివృద్ధి ప్రకటనలు కాదు.. ఆచరణ ఏది?

కరీంనగర్‌లో రూ. 630 కోట్లతో మోడల్ రోడ్లు, స్కైవాక్‌లు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ. 840 కోట్ల ప్రాజెక్టులంటూ చేసిన ప్రకటనలకు సంబంధించిన అధికారిక మంజూరు ఉత్తర్వులు (జీవోలు) ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. వేములవాడ, కొండగట్టు ఆలయాలకు ‘ప్రసాద్’ పథకం కింద తెచ్చిన నిధులెంత? రీంనగర్-జగిత్యాల, కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారుల పురోగతి ఏమిటని నిలదీశారు.

​విద్యాసంస్థలు, రైల్వే, పరిశ్రమల ఊసేది?

గతంలో వినోద్ కుమార్ హయాంలో ప్రతిపాదించిన ఐఐఐటీ సహా ఇతర జాతీయ విద్యాసంస్థల ఏర్పాటులో మీ కృషి ఏమిటని ప్రశ్నించారు. సిరిసిల్ల నేతన్నల కోసం మెగా పవర్‌లూమ్ క్లస్టర్, కరీంనగర్‌లో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, అలాగే హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, ముంబైలకు కొత్త రైళ్ల సాధనపై సమాధానం చెప్పాలని కోరారు.

తెలంగాణ హక్కులు, రేవంత్ సర్కార్ వైఫల్యాలపై మౌనమెందుకు?

విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధనలో కేంద్రంపై ఎంత ఒత్తిడి తెచ్చారని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెలకొన్న విద్యుత్ కోతలు, సాగునీటి కొరత, కాళేశ్వరం నీటి ఎత్తిపోతల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదని మండిపడ్డారు. కేవలం బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే స్పందిస్తూ, ప్రజా సమస్యలపై మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు.

​’చిల్లర గ్యాంగ్’తో వ్యక్తిగత విమర్శలు వద్దు

“నేను అడిగిన ప్రశ్నలకు రాజకీయ కక్షతో కాకుండా.. ఆధారాలు, గణాంకాలతో కేంద్ర మంత్రిగా మీరే నేరుగా సమాధానం చెప్పాలి. అనుచరులైన ‘చిల్లర గ్యాంగ్’ను రంగంలోకి దించి ప్రెస్‌మీట్లు పెట్టించి వ్యక్తిగత విమర్శలకు దిగితే స్పందించే ప్రసక్తే లేదు” అని సర్దార్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజలకు కావాల్సింది వ్యక్తిగత ఆరోపణలు కాదని, అభివృద్ధి లెక్కలని ఆయన తేల్చిచెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>