కలం, వెబ్ డెస్క్: నిషేధిత మాంజా (Manja)పై హైదరాబాద్ పోలీసులు విస్త్రతంగా తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా చైనా మాంజాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి సోదాలు చేస్తున్నారు. వ్యాపారులు ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి చైనా మాంజాను ఆర్డర్లపై తెప్పించినట్టు గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు తనిఖీలు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. సౌత్ వెస్ట్ జోన్‌లో అత్యధికంగా 34 కేసులు నమోదు కాగా, 46 మందిని అరెస్ట్ చేశారు. నగరవ్యాప్తంగా చైనా మాంజాను అమ్ముతున్నవారిపై 103 కేసులు నమోదయ్యాయి. 143 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చైనా మాంజా కారణంగా మనుషులు, జంతువులు, పక్షులకు తీవ్ర గాయాలవుతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు సైతం తీసేస్తున్నాయి. సంక్రాంతి (Sankranti) పండుగ సమీపిస్తుండటంతో నగరంలో మాంజా వాడకం పెరగడంతో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చైనా మాంజాను , అమ్మినా లేదా వాడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు.


