యాదాద్రిలో బడుల్లోనే మొదలైన మత్తు మహమ్మారిపై పోరాటం

కలం, యాదాద్రి భువనగిరి జిల్లా: చదువుల బాట పట్టాల్సిన వయసులో మత్తు పదార్థాల వైపు అడుగులు పడితే భవిష్యత్తు ప్రశ్నార్థకమే! యువతను లక్ష్యంగా చేసుకుంటున్న మాదక ద్రవ్యాల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ.. పాఠశాలల నుంచే చైతన్య సమరానికి సిద్ధమైంది. విద్యార్థుల్లో అవగాహన (Anti Drug Awareness) పెంచడం, మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం లక్ష్యంగా ‘నషా ముక్త్ విద్యాలయ అభియాన్’కు ప్రాధాన్యతనిస్తోంది.

భవిష్యత్తును కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే!

రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో డీఈఓ బొల్లారం భిక్షపతి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వ్యాప్తి సమాజానికి పెను సవాలుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలు వ్యక్తి ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబాలను, సామాజిక సంబంధాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, ఒంటరిగా ఉండటం, అనవసరమైన కోపం, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి పరిణామాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. సమస్యను శిక్షతో కాకుండా అవగాహన, కౌన్సెలింగ్, కుటుంబ సహకారంతో పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.

గోడపత్రికతో చైతన్యం.. ప్రతిజ్ఞతో పెరిగిన బాధ్యత!

కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా ప్రతి పాఠశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు విస్తరించాలని ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా సందేశమిచ్చారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి వ్యతిరేక గోడపత్రికను ఆవిష్కరించి, మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పెసరు లింగారెడ్డి, రిసోర్స్ పర్సన్లు సురేంద్ర మోహన్, శ్రవణ్ కుమార్, భువనగిరి ఎంఈఓ సీహెచ్. రంగరాజన్, ఇతర మండలాల విద్యాధికారులు, రిసోర్స్ పర్సన్లు, ప్రహరీ క్లబ్ విద్యార్థి సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>