కలం, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీర ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి, పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(AP), తమిళనాడు సహా శ్రీలంకలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వాయుగుండం ప్రభావం ప్రస్తుతం శ్రీలంక, తమిళనాడుపై స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీలంకలోని తూర్పు తీర ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి. అటు తమిళనాడులోని నాగపట్నం, తిరువారూర్, కడలూరు వంటి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనవరి 9, 10 తేదీల్లో అక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై సహా పలు తీర ప్రాంత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఆంధ్రప్రదేశ్(AP)లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం ఉండనుంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ పనులు, కోత దశలో ఉన్న పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.


