జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రౌడీ షీటర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని కేసీఆర్(KCR) వ్యాఖ్యానించారు. గురువారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన అభ్యర్థి సునీత, పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే సునీత(Maganti Sunitha) విజయాన్ని నియోజకవర్గం ప్రజలు ఖరారు చేశారని అన్నారు. “జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ రౌడీ షీటర్‌కి టికెట్ ఇవ్వడం ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష. రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని ప్రజలు చిత్తుగా ఓడించాలి” అని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయిందని ఆయన విమర్శించారు. “కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి స్థంభించింది. పథకాలు నిలిచిపోయాయి. రైతులు, పేదల పరిస్థితి మరింత దిగజారింది,” అని అన్నారు.
కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందని, ఇక జూబ్లీహిల్స్ లో తన అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్ ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞులైన జూబ్లీ హిల్స్(Jubilee Hills) ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీ హిల్స్ గౌరవాన్ని హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో.. పోటీలో ఉన్న అభ్యర్ధి శ్రీమతి మాగంటి సునీత, కేటీఆర్, హరీష్ రావు సహా కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో… క్షేత్రస్థాయిలో ఇప్పడిదాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద అధినేత కు ఇంచార్జీలు రిపోర్ట్ చేశారు. పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించి కేసీఆర్(KCR) దిశా నిర్దేశం చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ నేతలకు చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని సూచించారు.
Read Also: ఇద్దరు పిల్లల నిబంధన రద్దు.. ఆమోదం తెలిపిన క్యాబినెట్

