కలం, వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ (Vijay Thalapathy) అభిమానులకు చేదు వార్త. ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) విడుదల వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కావాల్సిన ఈ చిత్రం, చివరి నిమిషంలో సెన్సార్ చిక్కుల్లో పడటంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
విడుదలకు కేవలం ఒక్క రోజే గడువు ఉన్నప్పటికీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) నుంచి సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడమే ఈ వాయిదాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలపై బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు, 27 చోట్ల కట్స్ (మార్పులు) సూచించినట్లు సమాచారం. ఈ జాప్యాన్ని సవాలు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. “మేము ఇప్పటికే బోర్డు సూచించిన మార్పులన్నీ చేశామని, అయినా సర్టిఫికేట్ ఇవ్వకుండా జాప్యం చేయడం వల్ల భారీ నష్టం వాటిల్లుతుందని” పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, న్యాయస్థానం ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేయడంతో జనవరి 9న విడుదల కావడం అసాధ్యమని స్పష్టమైంది.
విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించకముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో ‘జన నాయగన్’ (Jana Nayagan) పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో సుమారు ₹500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కోట్లాది రూపాయల వసూళ్లు నమోదయ్యాయి.
సంక్రాంతి పండుగ వేళ తమ అభిమాన హీరో సినిమాను థియేటర్లలో చూడాలనుకున్న ఫ్యాన్స్ ఈ వార్తతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కోసం థియేటర్లు సిద్ధం చేశారు. బుక్ చేసుకున్న టికెట్ల రీఫండ్ ప్రక్రియ గురించి నిర్మాతలు త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు. కోర్టు తీర్పు, సెన్సార్ బోర్డు క్లియరెన్స్ లభించిన తర్వాత మాత్రమే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Read Also: చరణ్ కి నాని భయపడ్డాడా..?
Follow Us On: Instagram


