కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలో బీఆర్ఎస్కు అత్యంత పట్టున్న నియోజకవర్గం ఏదంటే ఠక్కున గుర్తొచ్చే వాటిలో సిరిసిల్ల (Sircilla) ఒకటి. మాజీ సీఎం కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచారు. అయితే, రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టాలనే కేటీఆర్ కోరిక నెరవేరడం సాధ్యమేనా? పార్టీకి అధికారం సంగతి అటుంచి సిరిసిల్ల నుంచి తాను గ్యారంటీగా గెలుస్తారా? ఎలాగైనా సరే కేటీఆర్‌ను ఓడించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారా?.. సిరిసిల్లలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కలుగుతున్న అనుమానాలివి. ఒక పక్క బీఆర్ఎస్ స్థానిక నాయకులు చేజారుతుండడం, మరోపక్క కేటీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు వీటికి బలం చేకూరుస్తున్నాయి.
కేటీఆర్ 2009లో తొలిసారి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. తరువాత 2010 ఉప ఎన్నికలతో పాటు 2014, 2018, 2023 ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి కేటీఆర్ గెలుపొందాడు. ఇక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన కేటీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బ్రేక్ వేయాలని కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇది పసిగట్టిన కేటీఆర్.. కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తు వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు సిరిసిల్లలో ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా తనకు సమాచారం వచ్చేలా కేటీఆర్ నెట్ వర్క్ ఏర్పాటుచేసుకోవడం చూస్తే ఇదే నిజమనిపిస్తోంది.
మూడు లీగల్ సెల్స్.. ?
రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే స్థానిక నాయకులు చేజారకుండా చూసుకోవడం ముఖ్యం. అధికార పార్టీ ప్రలోభాలకు, బెదిరింపులకు, కేసులకు లొంగి పార్టీ మారకుండా కార్యకర్తలను, నాయకులను కాపాడుకోవాలి. ఇందులో భాగంగానే కేటీఆర్ మూడు లీగల్స్ ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడి తమ సర్పంచ్‌లు చేజారిపోకుండా లీగల్ సెల్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లో సర్పంచులు చేజారితే వచ్చే ఎన్నికల్లో విజయం కష్టమని భావించి ఈ లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. అలాగే కార్యకర్తలు పార్టీ వీడకుండా ఒకటి, అధికార పార్టీ అక్రమాలను బయటపెట్టే మీడియా ప్రతినిధులకు అండగా మరొక లీగల్ సెల్ ఏర్పాటుచేసేందుకు కేటీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
చేజారుతున్న నేతలు..
ఒకవైపు సిరిసిల్లలో మరో మారు జెండా ఎగరవేయాలని కేటీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటుండగా.. మరోవైపు బీఆర్ఎస్ స్థానిక నేతలు పార్టీ మారడం మాత్రం ఆగడం లేదు. ఇటీవలే రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య సొంత మండలంలోని ఎల్లారెడ్డిపేట నుంచి పలువురు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. మరి కొందరు తెలంగాణ జాగృతిలోకి వెళ్లారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మూడేళ్ల ముందుగానే కేటీఆర్ సిరిసిల్లపై ఫోకస్ చేస్తుండగా, మరొక వైపు స్థానిక నేతలు చేజారుతుండడం ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

Read Also: అధికారుల నిర్లక్ష్యం.. సర్కారుకు శాపం!
Follow Us On : WhatsApp


