కలం, వెబ్‌డెస్క్: బిహార్‌లో బంగారు దుకాణాల (Bihar gold shops) యజమానులు తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయ వివాదం రేకెత్తించింది. సీఎం నితీశ్ కుమార్ ఓ మహిళ హిజాబ్‌ను లాగిన వివాదం ఇంకా పూర్తిగా సద్దుమణగకముందే అలాంటిదే మరొకటి తలెత్తింది. ముఖం కనపడకుండా కప్పి ఉంచేలా హిజాబ్, నిఖాబ్, హెల్మెట్, మాస్క్ ధరించి వచ్చేవాళ్లను దుకాణాల లోపలికి అనుమతించబోమని, ఆభరణాలు అమ్మబోమని గోల్డ్ షాప్ ఓనర్ల సంఘం నిర్ణయం తీసుకోవడం దీనికి కారణం.
ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని ఆ రాష్ట్ర ఆల్ ఇండియా జ్యువెల్లర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ ప్రకటించింది. వివిధ జిల్లాల ప్రతినిధులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెల్లడించింది. ‘ముఖాలను ముసుగుతో కప్పుకొని వచ్చే కస్టమర్లకు ఆభరణాలు అమ్మకూడదని నిర్ణయించాం. హిజాబ్, హెల్మెట్, మాస్క్‌లు తదితర వాటితో ముఖం కప్పుకొని షాపుల్లోకి వచ్చేవాళ్లకు ఆభరణాలు చూపించం. కస్టమర్లు, జ్యువెల్లరీ షాప్స్ ఓనర్స్‌ను సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని గోల్డ్‌షాప్ ఓనర్ల వర్తక సంఘం అధ్యక్షుడు అశోక్ వర్మ వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా ముసుగుతో వస్తే తొలగించమని కోరతామని, వాళ్లు నిరాకరిస్తే ఆభరణాలు అమ్మబోమని వర్మ తెలిపారు.
కాగా, ముసుగేసుకొని వచ్చి బంగారు దుకాణాల్లో దొంగతనానికి పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరుగుతున్న సంగతి తెలిసిందే. షాపుల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలను గుర్తించడం సమస్యగా మారుతున్నట్లు వర్తకులు చెబుతున్నారు. ప్రస్తుత నిర్ణయం తర్వాత బిహార్ రాజధాని పాట్నాతోపాటు ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దుకాణాల ముందు వర్తకులు ముసుగు విషయం గురించి బోర్డులు పెట్టారు. కొన్ని రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గోల్డ్ షాప్ దుకాణాల ఓనర్లు ఇలాంటి నిర్ణయమే తీసుకోవడం గమనార్హం.
బిహార్ జ్యువెల్లరీ షాప్ (Bihar gold shops) ఓనర్ల నిర్ణయం ఆ రాష్ట్రంలో రాజకీయ వివాదం సృష్టిస్తోంది. ఇది మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని, రాజ్యాంగంలోని మత స్వేచ్చకు భంగం కలిగిస్తోందని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) విమర్శించింది. ఇది బీజేపీ–ఆర్ఎస్ఎస్ తీసుకున్న నిర్ణయంలా ఉందని పేర్కొంది. ‘గోల్డ్ షాప్ ఓనర్ల నిర్ణయం సెక్యూరిటీ పరంగా ఓకే. కానీ, మహిళల గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా షాపుల్లో మహిళా సిబ్బంది ఉండాలి’ అని ఏఐఎంఐఎం కోరింది. బంగారు దుకాణాల వర్తకులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జనతా దళ్(జేడీయూ) విన్నవించింది.
Read Also: ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణ.. ఇక ట్రాఫిక్ జామ్‌కు బైబై..!
Follow Us On: X(Twitter)


