కలం, ఖమ్మం బ్యూరో : 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలు (Kabaddi Championship) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం (Edulla Bayyaram) గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో బుధవారం రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో, కంది చారిటబుల్ ట్రస్ట్, మౌర్య టెక్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలకు మంత్రులతో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి “ఈస్ట్ ఆర్ వెస్ట్ – ఇండియా ఇస్ ది బెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్ – బయ్యారం ఇస్ ది బెస్ట్, భారత్ మాతాకీ జై” అంటూ నినాదాలు ఇచ్చారు. కబడ్డీ అనేది మన దేశంలోనే పుట్టిన సంప్రదాయ క్రీడ అని, మన మట్టిలో పుట్టిన ఈ ఆటలు మన సంస్కృతి, సువాసనను ప్రపంచానికి చాటుతాయని అన్నారు. కబడ్డీ చెమటతో, శ్రమతో ఆడే క్రీడ అని, గెలుపు–ఓటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. దేశ చరిత్రలో తొలిసారిగా మారుమూల గిరిజన ప్రాంతమైన ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం గర్వకారణమన్నారు. ఈ పోటీల ద్వారా బయ్యారం గ్రామం పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని తెలిపారు.
అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను బయ్యారం గ్రామంలో నిర్వహించేందుకు బాధ్యత తీసుకున్న కంది చారిటబుల్ ట్రస్ట్ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రీడా పోటీల నిర్వహణ కోసం వారు సుమారు ఆరు నెలల పాటు శ్రమించి, ఏర్పాట్ల నుంచి ఆతిథ్యం వరకు సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించి, అనుభవాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. చిన్నపాటి తప్పిదాలతో ఓడిపోయినప్పుడు నిరాశ చెందకుండా, గెలుపు ఇచ్చే ఆనందాన్ని, ఓటమి ఇచ్చే పాఠాలను జీవితానికి తీసుకెళ్లాలని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతమైన బయ్యారంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు (Kabaddi Championship) నిర్వహించటం ఎంతో సంతోషకరమన్నారు. గ్రామీణ స్థాయిలో యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ తరహా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించామని, అదే విధంగా జాతీయస్థాయి పోటీలను కూడా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాలా సహకరిస్తోందన్నారు.
Read Also: ఫుట్‌బాల్ క్లబ్ చెల్సికు కొత్త కోచ్
Follow Us On: Youtube


