శాండ్‌పేపర్ వివాదం.. కమిన్స్‌కు మురళీ కౌంటర్

క‌లం, స్పోర్ట్స్: బాల్ ట్యాంపరింగ్ బౌలర్లకు తెలియకుండా జరుగుతుందా? బౌలర్ల కోసమే బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేసినప్పుడు.. వారికి సమాచారం లేకుండా ఎలా ఉంటుందని మాజీ భారత స్పిన్నర్ మురళీ కార్తీక్ ప్రశ్నించారు. 2018 శాండ్‌పేపర్ వివాదం (Sandpaper Scandal)పై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వాదనను తప్పుబట్టారు. ఉస్మాన్ ఖవాజా వెల్లడించిన విషయాలకు మద్దతుగా నిలిచారు. 2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్‌తో బంతిని దెబ్బతీస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌పై చర్యలు తీసుకున్నారు.

తాజాగా తన ‘సబ్ర్’ పుస్తకంలో ఖవాజా ఈ వ్యవహారంపై కీలక విషయాలు వెల్లడించారు. జట్టులోని అందరికీ ఈ ప్రణాళిక గురించి తెలుసని, కమిన్స్‌కు కూడా విషయం తెలుసని పేర్కొన్నారు. అయితే ఖవాజా ఆరోపణలను కమిన్స్ ఖండించారు. శాండ్‌పేపర్‌ను మైదానంలో ఉపయోగిస్తున్న విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. ఖవాజా చేసిన ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన మురళీ కార్తీక్.. బౌలర్ల ప్రయోజనం కోసమే బంతిని ట్యాంపరింగ్ చేస్తున్నప్పుడు వారికి తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

ఒక బౌలర్ కోసం మరో ఇద్దరు ఆటగాళ్లు ఇలాంటి పని చేస్తుంటే.. ఆ బౌలర్‌కు తెలియదని ఎలా చెప్పగలమని నిలదీశారు. ఈ ఘటనలో కేవలం ముగ్గురు ఆటగాళ్లే శిక్షకు గురికావడం కూడా తనను ఆశ్చర్యపరిచిందని కార్తీక్ అన్నారు. బౌలర్లందరికీ ఈ విషయం తెలిసే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘అసలు మనం చిన్నపిల్లలమా? ఇలాంటి విషయాన్ని నమ్మడానికి?’ అంటూ కమిన్స్ వాదనపై ఘాటుగా స్పందించారు.

డేవిడ్ వార్నర్ బయటకు వచ్చి అన్ని విషయాలు వెల్లడిస్తాడనే ప్రచారం ఉండేదని, కానీ ఇప్పుడు ఖవాజానే ఈ విషయాలను బయటపెట్టారని కార్తీక్ గుర్తుచేశారు. అందరికీ విషయం తెలుసనే తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. జట్టులోని ఆటగాళ్లంతా ఒకే మాటపై ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>