కలం, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం (Srikalahasti Temple)లో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే అమ్మవారి గర్భాలయం వరకు ఓ భక్తుడు స్పై కెమెరా అమర్చిన కళ్లజోడుతో వెళ్లడం ఆలయ వర్గాల్లో కలకలం రేపింది.
దర్శనం కోసం వచ్చిన మహారాష్ట్రలోని పూణేకు చెందిన అంకేష్ అగర్వాల్ అనే వ్యక్తి కళ్లజోడు తీరుపై అక్కడి పూజారికి అనుమానం కలిగింది. వెంటనే అప్రమత్తమైన పూజారి ఆ కళ్లజోడును క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో రహస్య కెమెరా ఉన్నట్లు గుర్తించారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా గర్భాలయంలోకి స్పై కెమెరా తీసుకెళ్లిన విషయాన్ని పూజారి ఎస్పీఎఫ్ (SPF) అధికారులకు తెలియజేశారు.
సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలయ రహస్యాలను చిత్రీకరించే ఉద్దేశంతోనే వచ్చాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవలే ఆలయ ప్రసాదాల పోటులో అగ్నిప్రమాదం జరిగిన ఘటన మరువకముందే, తాజాగా స్పై కెమెరా వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆలయ భద్రతపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

