కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. అబద్దాలు, పచ్చి అబద్దాలకు మించి ‘అభయ హస్తం’ ఉందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పలు హామీల అమలుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. బడ్జెట్ లో బీసీలకు లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామినిచ్చి.. మూడేళ్లలో రూ.5 వేల కోట్లలోపే అమలు చేశారని ఆరోపించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం వాటా కల్పిస్తామని చెప్పి ఇన్ని రోజులైన అమలు చేయలేదన్నారు.
అలాగే, పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల అంబేద్కర్ అభయ హస్తం ప్రకటించినా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 31 శాతం వాటా కల్పిస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 365 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామినిచ్చి కేవలం 10 వేలు మాత్రమే భర్తీ చేశారన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు కూడా అమలుకు నోచుకోలేదని ఆయన (KTR) విమర్శించారు.

