epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రేవంత్ రెడ్డికి మూటలు మోసుడు తప్ప ఏం తెల్వదు : కేటీఆర్​

కలం, వరంగల్ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి మూటలు మోసుడు తప్ప ఏం తెల్వదు అని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. జనగామ పట్టణంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‌లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల అభినందన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్​ మాట్లాడుతూ.. ‘రేవంత్​ రెడ్డి (Revanth Reddy) నీళ్ల గురించి కేసీఆర్‌కు పాఠాలు చెప్తాడు. భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిపోయింది. ఎలా ప్రజలను మోసం చేశారో.. రైతుల పరిస్థితులు ఎలా తయారయ్యాయో ఆలోచించాలి. యూరియా కోసం చలిలో ఎదురు చూస్తున్నారు. ఎనకటి రోజులు తెస్తామని చెప్పిన రేవంత్​ రెడ్డి అదే రాబందు కాలం తీసుకొచ్చాడు’ అని కేటీఆర్​ నిప్పులు చెరిగారు.

తెలంగాణను 60 సంవత్సరాల పాటు రాచిరంపానా పెట్టింది కాంగ్రెస్ పార్టీ.. అనే విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని కేటీఆర్​ విమర్శించారు. ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ సాధించిన కేసీఆర్ పైన అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నదులపై, తెలంగాణపై రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశాడన్నారు.

రైతుబంధు, బోనస్​ చెల్లిస్తా అని చెప్పి కాంగ్రెస్​ పార్టీ నాయకులు రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి సంవత్సరమే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ మాటలు విని ప్రతి నిరుద్యోగి విద్యార్థి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారన్నారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీర, నెలకు 2500 ఇవ్వలేని రేవంత్ రెడ్డి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అంటున్నాడని కేటీఆర్​ ఎద్దేవా చేశారు. కనీసం తులం బంగారం అయినా ఆడబిడ్డలకు ఇచ్చారా? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు పుస్తెలతాడు తాకట్టు పెట్టి బతికే పరిస్థితి దాపురించిందన్నారు.

రేవంత్ రెడ్డి ఎందుకు అంత పిచ్చిగా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి ఇంకా ఏడుపు ఎందుకు?.. రేవంత్ రెడ్డి తన చదువు మీద ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదన్నారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్‌కే రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నాడని.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అసెంబ్లీలోనే గుండె ఆగి చస్తాడని ఎద్దేవా చేశారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ను గెలిపించాలని KTR పిలుపునిచ్చారు.

Read Also: రూ.65 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షించాం : హైడ్రా కమిషనర్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>