కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో వాహనదారుల ఫ్యాన్సీ నెంబర్ల మోజు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపించింది. తమ వాహనాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో యజమానులు పోటీ పడి మరీ లక్షల రూపాయలు వెచ్చించారు. ఖైరతాబాద్‌లోని హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్ల వేలంలో (Fancy Number Auction) ప్రభుత్వానికి కేవలం ఒక్కరోజే రూ. 43.57 లక్షల ఆదాయం సమకూరింది.
‘TG 09 J 9999’ నంబర్ కు తీవ్ర పోటీ..
ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన TG 09 J 9999 నంబర్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. చివరకు కీస్టోన్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 18 లక్షల భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ నంబర్‌ను సొంతం చేసుకుంది. ఒక్క ఈ నంబర్ ద్వారానే ప్రభుత్వానికి వచ్చిన మొత్తం ఆదాయంలో దాదాపు సగం వాటా లభించడం విశేషం. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు పోటాపోటీగా వేలంలో (Fancy Number Auction) పాల్గొనడం వల్లే ఈ స్థాయిలో ధర పలికిందని అధికారులు వెల్లడించారు. కేవలం 9999 మాత్రమే కాకుండా, మరికొన్ని ప్రత్యేక నంబర్లు కూడా లక్షల్లో ధర పలికాయి.
భారీ ధర పలికిన ఇతర నంబర్లు:
TG 09 K 0006 నంబర్‌ను అనంతలక్ష్మి కుమారి నామల 7,06,666 రూపాయలకు దక్కించుకున్నారు.
TG 09 K 0005 నంబర్‌ను నేహా అగర్వాల్ 1,89,001 రూపాయలకు వేలంలో గెలుచుకున్నారు.
TG 09 J 9909 నంబర్ కోసం సాయి వెంకట్ సునాగ్ పాలడుగు 1,44,999 రూపాయలు వెచ్చించారు.
TG 09 K 0009 నంబర్‌ను శ్రీనివాస కనస్ట్రక్షన్స్ లక్ష రూపాయలకు సొంతం చేసుకుంది.
TG 09 K 0001 నంబర్‌ను ఇషాని కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ లక్ష రూపాయలకు దక్కించుకుంది.
ఫ్యాన్సీ నెంబర్లతో ఫ్యాన్సీ ఆదాయం..
ఫ్యాన్సీ నంబర్ల (Fancy numbers) వేలం ద్వారా ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం (Non-tax revenue) ఆశాజనకంగా అందుతోందని ఖైరతాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సి.హెచ్. రమేశ్ తెలిపారు. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ప్రత్యేక అభిమానం, సెంటిమెంట్ల కారణంగా ఇలాంటి నంబర్ల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ వేలం ప్రక్రియ ద్వారా రవాణా శాఖకు ఒకే రోజులో 43,57,000 రూపాయల ఆదాయం రావడం గమనార్హం.
Read Also: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి మూడు సార్లు పీఎఫ్ విత్ డ్రా
Follow Us On: Sharechat


