కలం, తెలంగాణ బ్యూరో: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను (Telangana Graduate MLC Elections) అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అందుకే రెండు స్థానాల్లోనూ వేరే పార్టీల కంటే ముందే అభ్యర్థుల్ని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ (BJP) ఒకింత అడ్వాన్స్ లో ఉన్నా ఈసారి మాత్రం అభ్యర్థుల్ని ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. బీఆర్ఎస్ (BRS) సైతం అదే ధోరణి అనుసరిస్తున్నది. హైదరాబాద్ స్థానాన్ని బీజేపీకి, వరంగల్ స్థానాన్ని బీఆర్ఎస్ చేజిక్కించుకునేలా ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి అవగాహన కుదిరిందన్న కామెంట్లు గ్రాడ్యుయేట్ ఓటర్లలో వినిపిస్తున్నాయి.
వరంగల్ స్థానాన్ని బీఆర్ఎస్ ప్రకటించకపోయినా గతంలో పోటీచేసిన రాకేశ్‌రెడ్డినే ఫైనల్ చేయాలనుకుంటున్నట్లు గులాబీ వర్గాల సమాచారం. హైదరాబాద్ స్థానంలో బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ అయిన ప్రస్తుత ఆ పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు పోటీ చేస్తారన్నది కమలనాథుల వాదన. ఈ రెండింటినీ చెరో పార్టీ గెల్చుకునేలా అండర్‌స్టాండింగ్ కుదిరిందని, అందువల్లనే క్యాండిడేట్లను ప్రకటించకుండా జాప్యం చేస్తున్నాయన్నది కాంగ్రెస్ నేతల అనుమానం.
ప్లాన్ ప్రకారమే రెండు పార్టీల ఆలస్యం
గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలుత అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. కానీ ఈసారి మాత్రం ఆ వ్యూహాన్ని కాంగ్రెస్ టేకప్ చేసింది. అన్ని పార్టీలకంటే ముందే ఉండే బీజేపీ ఈసారి ఎందుకు ఆలస్యం చేసిందనే చర్చ ఆ పార్టీలోనే నెలకొన్నది. బీఆర్ఎస్ సైతం రెండు స్థానాలనూ చేజిక్కించుకుంటామంటూ ధీమాగా చెప్తున్నా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేస్తున్నది.
కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకే..!
బీజేపీ, బీఆర్ఎస్ చెరో స్థానాన్ని గెల్చుకుని కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాకుండా చేయాలన్న ఆలోచనే ఇందుకు కారణమన్నది హస్తం నేతల వాదన. “హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది… వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీ మద్దతు బీఆర్ఎస్‌కు ఉంటుంది..” అనే టాక్ గాంధీభవన్‌లో మాత్రమే కాక ఒక సెక్షన్ గ్రాడ్యుయేట్ ఓటర్లలోనూ వినిపిస్తున్నది. ఆ రెండు పార్టీల అవగాహన మేరకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందనేది వారి వాదన.
ఓటర్ల నమోదు గడువు ముగిసినా సస్పెన్స్
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాలు, వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అర్హులైన గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేసుకోడానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గడువు ఈ నెల 6వ తేదీతో ముగిసింది. దాదాపు 12 లక్షల మందికిపైగా గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా వారి పేర్లను నమోదు చేసుకునేందుకు ఫామ్-18 దరఖాస్తులను సమర్పించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నదంటూ పలు పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
దీంతో షెడ్యూలులో మార్పులు చేయకపోయినప్పటికీ నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్ ఒకింత అడ్వాన్స్ అయినా బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం టైమ్ తీసుకోవడం ఇలాంటి గుసగుసలకు తావిచ్చినట్లయింది. పక్కాగా చెరొకటి గెలిచేందుకు హైదరాబాద్‌లో బీఆర్ఎస్, వరంగల్ స్థానంలో బీజేపీ డమ్మీ అభ్యర్థుల్ని నిలబెట్టొచ్చన్నది ఆ అనుమానాలకు కారణం.
వరంగల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వరంగల్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైందన్నది ఆ మూడు జిల్లాల్లోని గులాబీ లీడర్ల వాదన. అందరికంటే ముందే ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో సెకండ్ ప్లేస్‌లో నిలిచిన రాకేశ్‌రెడ్డిని ఈసారి కూడా అభ్యర్థిగా ఖరారు చేయాలని బీఆర్ఎస్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నదని, ఆ సంకేతంతోనే ఆ పార్టీ తరఫున కేవలం ఆయన మాత్రమే ప్రచారం చేస్తున్నారన్నది ఆ జిల్లాల్లోని టాక్.
హైదరాబాద్ స్థానం విషయంలో ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేయాలన్న అంశంలో చాలా వారాలుగా చర్చలు జరుగుతున్నా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ స్థానంలో ప్రజాదరణ లేని వ్యక్తిని ఎంపిక చేసి బీజేపీకి వదిలేయాలన్న ఉద్దేశమే కారణమన్న మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీ తరపున హైదరాబాద్ స్థానంలో రాంచందర్‌రావు పేరు ఖరారయ్యే అవకాశమున్నది. ఇక్కడ ఈ పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టి వరంగల్ స్థానాన్ని లైట్ తీసుకుని బీఆర్ఎస్‌కు వదిలేసే అవకాశమున్నదనే మాటలు కమలనాథుల నుంచే వినిపిస్తున్నాయి.

