కలం, వెబ్ డెస్క్: హీరో నాగార్జున (Nagarjuna) సహకారం అందించడంతోనే తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ వేగంగా పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును ప్రారంభించి, హైదరాబాద్ ప్రజలకు అంకింతం చేశారు. అడిగిన వెంటనే అక్కినేని నాగార్జున రెండెకరాల భూమిని ఉదారంగా ప్రభుత్వానికి అప్పగించేసి.. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోగా నిలిచారంటూ ప్రశంసలు కురిపించారు. ఆయన నిజమైన హైదరాబాదీ, రియల్ హీరో అన్నారు. తాను ఆహ్వానించిన వెంటనే ఎక్కడో షూటింగులో ఉన్నప్పటికీ, ప్రత్యేక విమానంలో వచ్చారని అభినందించారు. ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం శాలువాతో సన్మానించడం సబబుగా ఉంటుందన్నారు.
సరస్సుల నగరం కాస్తా..
హైదరాబాద్ అంటే సరస్సుల నగరంగా కీర్తించేవారని.. నగర ప్రజల దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్(Osman Sagar), హిమాయత్ సాగర్ వంటివి వందేళ్లుగా పనిచేస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ఒకప్పుడు 1372 చెరువులుంటే, కాలక్రమేణా ఎన్నో చెరువులు కనుమరుగైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నదిని ప్రక్షాళన చేయడం లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నదులు నాగరికతకు పుట్టినిల్లు అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. తమ్మిడికుంట చెరువు (Thammidikunta Cheruvu) పునరుద్ధరణ చేసే సమయంలో కొందరికి ఇబ్బంది కలిగినా.. ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు.
ఎవరు మూసీ నది పేరు పెట్టుకోరు..
సినారె లాంటి గొప్ప కవి తన కుమార్తెలకు గోదావరి, సరస్వతి వంటి నదుల పేర్లు పెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. మూసీ నది పేరు పెట్టుకోవాలని మాత్రం ఎవరూ అనుకోరని, ఎందుకంటే అది కాలుష్య కోరల్లో చిక్కుకుపోయిందన్నారు. మూసీ కారణంగా నల్గొండ జిల్లాలో నీళ్లు నల్లగా వస్తున్నాయని అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. అందుకు తమ్మిడికుంట చెరువునే ఆదర్శంగీ తీసుకుంటామన్నారు. దీని స్ఫూర్తితో నగరంలోని మరిన్ని చెరువులను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.
Also Read : భూముల రీసర్వేకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Follow Us On: Youtube

