కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాగునీటి రంగానికి మహర్దశ తెచ్చేందుకు వరద ముప్పు నుంచి పట్టణాలకు శాశ్వత రక్షణ కల్పించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర సాగునీటి, ఆయకట్టు అభివృద్ధి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో బుధవారం హైదరాబాద్‌లో కీలక భేటీ నిర్వహించారు. రెండు జిల్లాలకు చెందిన సాగునీటి రంగానికి సంబంధించిన 15 ప్రధాన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి సమగ్రంగా చర్చించారు.
ముఖ్యంగా మున్నేరు నది వరదల నుంచి ప్రజలకు, ఆస్తులకు రక్షణ కల్పించడంతోపాటు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, చెరువుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నదికి వరదలు వచ్చిన ప్రతిసారీ ముంపునకు గురవుతున్న పరివాహక ప్రాంతాలను రక్షించేందుకు ధంసలాపురం వరకు రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని మంత్రి తుమ్మల కోరారు. అలాగే టేకులపల్లి వద్ద ఎన్ఎస్పీ కుడి ప్రధాన కాలువకు గైడ్‌వాల్ నిర్మాణం, ఖమ్మం నగర తాగునీటి అవసరాల నిమిత్తం లకారం చెరువును నింపేందుకు రూ.8 కోట్లతో రెగ్యులేటర్ నిర్మాణ ప్రతిపాదనలపై చర్చించారు.
మరోవైపు, ఎన్జీటీ కేసు కారణంగా నిలిచిపోయిన సీతమ్మసాగర్ పనుల పునఃప్రారంభానికి పర్యావరణ అనుమతులకై పారివేశ్ పోర్టల్‌లో సమర్పించిన ప్రతిపాదనలను వేగవంతం చేయాలని కోరారు. సీతారామ ఎత్తిపోతల పథకంలోని జూలూరుపాడు టన్నెల్, ప్యాకేజీ-11 పనులతో పాటు ప్యాకేజీలు 1, 2, 7, 8 పరిధిలో ప్రెషరైజ్డ్ పైప్డ్ ఇరిగేషన్ నెట్వర్క్ అమలుకు ప్రతిపాదనలు అందజేశారు.
అలాగే వెంకమ్మ చెరువు వరద ప్రవాహ కాలువ, పెద్దవాగు ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు తెలంగాణ వాటా నిధులు, మరేళ్లపాడు ఎత్తిపోతల పథకం, దోమలవాగు సామర్థ్యం పెంపు వంటి అంశాలపై చర్చించారు. మురసు తుఫాన్ కారణంగా దెబ్బతిన్న మల్లెపూల వాగు కట్టల మరమ్మత్తులు, భేతుపల్లి పెద్ద చెరువు, ధంసలాపురం పెద్దచెరువు, ఖానాపురం ఊరచెరువుల సుందరీకరణకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
మంత్రి తుమ్మల ప్రస్తావించిన ఈ 15 కీలక అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. పెండింగ్ సమస్యలు, అనుమతులు, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులతో సమన్వయం చేసుకొని త్వరితగతిన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీటి వసతులు మెరుగుపడటంతోపాటు వరద ముప్పు నుంచి పూర్తి రక్షణ లభించనుంది.

