కలం, యాదగిరిగుట్ట: తరగతి గదుల్లో బోధన ఎలా సాగుతోంది? విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యత ఏమిటి? వసతి గృహాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? చిన్నారులకు పౌష్టికాహారం అందుతోందా? ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Collector Anuraag Jayanti) ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఆలేరులోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్.. కేవలం రికార్డులకే పరిమితం కాకుండా వంటగది నుంచి విద్యార్థినుల వసతి గదుల వరకు స్వయంగా పరిశీలించారు. భోజనశాల, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పరిస్థితులను తనిఖీ చేసి విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం విద్యా ప్రమాణాలపై దృష్టి సారించారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి బోధన తీరును తెలుసుకున్నారు.
పదో తరగతిపై ప్రత్యేక దృష్టి..
పరీక్షల సమయం దగ్గరపడుతున్న వేళ పదో తరగతి విద్యార్థినులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. పరీక్షలను భారంగా భావించకుండా ముందస్తు ప్రణాళికతో చదవాలని, ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించాలని సూచించారు. సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకుంటూ మంచి మార్కులు సాధించే దిశగా కృషి చేయాలని ప్రోత్సహించారు. పదో తరగతితోనే విద్య ఆగిపోకూడదని, ఉన్నత విద్య, ఐటీఐ, పాలిటెక్నిక్, పోటీ పరీక్షలు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై ఇప్పటి నుంచే అవగాహన పెంచుకోవాలని సూచించారు.
చిన్నారుల ఆహారంపై ఆరా..
ఆలేరు మండలం బహద్దూర్పేట ప్రాథమిక పాఠశాలను కూడా కలెక్టర్ సందర్శించారు. చిన్నారులతో కలిసిపోయి వారి దైనందిన ఆహారపు అలవాట్లు, పాఠశాలలో అందుతున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. గుడ్డు అందిస్తున్నారా? భోజనం బాగుంటుందా? అంటూ ఆప్యాయంగా ప్రశ్నించారు. చిన్నారులకు చదువుపై ఆసక్తి ఎంత ఉందో చిన్నచిన్న ప్రశ్నలతో తెలుసుకున్నారు. తనిఖీల వెనుక లక్ష్యం ఒక్కటేనని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన వసతి అందాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జయమ్మ, డీఈఓ బిక్షపతి, ఎమ్మార్వో ఆంజనేయులు, ప్రిన్సిపల్ కవిత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

