కలం, నల్లగొండ బ్యూరో: ప్రజా పోరాటాలతోనే పార్టీ బలోపేతం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) అన్నారు. మంగళవారం స్థానిక ఎం.ఎస్. గార్డెన్‌లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని, ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించాలని కోరారు.
పేద ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ ఎర్రజెండా అని ఆయన పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా ఉద్యమాలు నడిపించే నాయకులకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. గత సర్పంచ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమై కమ్యూనిస్టు నాయకులను ఓడించాలని చూసినా, ప్రజల మద్దతుతో అనేక చోట్ల గెలిచామని గుర్తు చేశారు. డబ్బు, మద్యంతో మభ్యపెట్టినా ప్రజలు నిజమైన ప్రజా నాయకులనే గెలిపించారని చెప్పారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ పేద వారికి అన్యాయం చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, వీటిని తిప్పికొట్టేందుకు ప్రజా ఉద్యమాలు చేపట్టాలన్నారు. కార్పొరేట్ విధానాలతో దేశాన్ని కొల్లగొడుతున్నారని, ప్రజలకు చెందాల్సిన సంపదను బడా బాబులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా బలమైన పోరాటాలు చేయాలని, ఈ ఉద్యమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజాన్ని అంతం చేసేందుకు అమెరికా కుట్రలు పన్నుతోందని జాన్ వెస్లీ (John Wesley) ఆరోపించారు. ప్రపంచంపై తన పెత్తనం చెలాయించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అందులో భాగంగానే వెనిజులా అధ్యక్షుడు మదురో దంపతులను అమెరికా సామ్రాజ్యవాదం అరెస్ట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: ఇక మహానగరంగా నల్లగొండ మున్సిపాలిటీ
Follow Us On: Youtube


