కలం, ఉట్నూర్: ఉట్నూర్ మండలం లక్కారం గ్రామపంచాయతీ పరిధిలోని రాంజీ గోండ్ నగర్, నవోదయ నగర్ జంట గ్రామాల ప్రజల ఆరాధ్య దైవమైన ఈశ్వరాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు (Temple Renovation) బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా గ్రామ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామ ప్రజలంతా ఐక్యంగా ముందుకొచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. భక్తిశ్రద్ధలు మనిషిలో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

