కలం, వరంగల్ బ్యూరో : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ‘మేడారం’ జాతరకు (Medaram Jatara) ఇంకా 22 రోజులు మాత్రమే ఉంది. కానీ జాతర పనులు మాత్రం పూర్తి కాలేదు. నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, అభివృద్ధి పనులు 80-90 శాతం పూర్తయ్యాయని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ జాతర ప్రారంభం నాటికి కూడా పనులు పూర్తయ్యేలా పరిస్థితులు లేవని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదట డిసెంబర్ నాటికల్లా పనులు పూర్తి చేస్తామని చెప్పిన అధికారులు, తర్వాత జనవరి ఐదో తేదీ అని చెప్పారు. కాగా రెండు రోజుల కిందట మేడారంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 20 లోపు పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పడం పట్ల భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొనసాగుతున్న పనులు
ఈ నెల 28-31 తేదీల మధ్య సమ్మక్క-సారలమ్మ జాతర జరగనుంది. గద్దెల విస్తరణ, ఆలయ ప్రాంగణం చుట్టూ గ్రానైట్ రాతి ప్రాకార నిర్మాణం, స్వాగత తోరణాల ఏర్పాటు పనులు వడివడిగా కొనసాగుతున్నాయి. గద్దెల చుట్టూ నిర్మిస్తున్న 32 గ్రానైట్ పిల్లర్లపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, చరిత్రను చిత్రీకరించారు. మార్బుల్ శిలలతో గద్దెలు, జంపన్నవాగు సుందరీకరణ, డ్రైనేజీ వ్యవస్థలు, ఫ్లడ్ మేనేజ్‌మెంట్, 60 అడుగుల నుంచి నాలుగు లైన్లకు రోడ్ల విస్తరణ, క్యూ లైన్లు, సత్రాలు, వాచ్ టవర్లు, గ్రీనరీ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
జనవరి మొదటి వారం నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి వీలుగా జంపన్నవాగులో నీటి ప్రవాహం సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి జాతరకు వచ్చే భక్తులకు పార్కింగ్ సమస్య తలెత్తకుండా గద్దెల సమీపంలోనే ఏకకాలంలో వేల వాహనాల పార్కింగ్‌కు అధికారులు చర్యలు తీసుకున్నారు. జాతర జరిగే 4 రోజులు డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణ కానుంది. జాతరపై సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు డాక్యుమెంటరీ కూడా రూపొందిస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా వన దేవతల గద్దెలు
మేడారం జాతరలో వన దేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.101 కోట్లు ఖర్చు చేస్తోంది. తాత్కాలిక ఏర్పాట్లతో పాటు రూ.251 కోట్ల నిధులతో శాశ్వత నిర్మాణాలతో అభివృద్ధి చేపట్టింది. సమ్మక్క సారలమ్మ జాతర పునర్నిర్మాణ పనుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసింది. 4 వేల టన్నుల గ్రానైట్‌పై ఆదివాసీ చరిత్ర సంస్కృతిని తెలిపేలా 7,000 బొమ్మలతో సమ్మక్క-సారలమ్మ జాతర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా, నాణ్యతా ప్రమాణాలతో రాజీ పడకుండా పనులు చేస్తున్నారు.
18న సీఎం రేవంత్ రెడ్డి రాక
ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం రానున్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎంకు జాతరకు రావాలంటూ ఆహ్వానం అందజేశారు. ఆనాటి కల్లా పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు మంత్రులు, అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

Read Also: కల్వకుంట్ల టు దేవనపల్లి పేరు, రూటు మార్చిన కవిత
Follow Us On: Youtube


