కలం, కరీంనగర్: ఆత్మీయుల జ్ఞాపకాలతో జరుపుకునే సాంప్రదాయ దీపావళి సమాధుల పండగకు సర్వం సిద్దం చేశామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ (Karimnagar) నగరంలో సమాధుల పండగ సందర్భంగా శనివారం కొలగాని శ్రీనివాస్ అధికారులు సిబ్బందితో కలిసి వ్యవసాయ మార్కెట్ సమీపంలోని స్మశాన వాటికలతో పాటు వల్లంపహాడు స్మశాన నాటికలను సందర్శించి.. ఏర్పాట్లను తనిఖీ చేశారు. పారిశుధ్య చదును పనులను పరిశీలించారు. ఏర్పాట్ల విషయంలో పలు సూచనలు చేస్తూ… ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ… కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దీపావళి రోజు చేసే సమాధుల పండగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఒక ప్రత్యేకమైన సాంప్రదాయంతో దశబ్ధాలుగా ఇక్కడ మరణించిన పూర్వీకులను స్మరించుకుంటూ గ్రేవ్ యార్డులలో దీపావళి పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దీపావళి పండగ రోజు కుటుంబ సమేతంగా కొంత మంది నగర ప్రజలు పూర్మీకుల సమాదుల వద్ద దీపాలు వెలిగించి… రకరకాల పిండివంటలు సమర్పించి సాంప్రదాయంగా దీపావళి వేడుకలు జరుపుకుంటారని తెలిపారు.
ఆరు దశాబ్దాలుగా వస్తున్న వారి ఆచార వ్యవహారాల ప్రకారం నగరపాలక సంస్థ ద్వారా ఘనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్మశాన వాటికల్లో సిబ్బంది తో పారిశుధ్య పనులు చేయడంతో పాటు, బ్లీచింగ్ చల్లడం, పేయింటింగ్, తాత్కాలికి ఎల్ఈడీ ప్లడ్ లైట్లు, లైటింగ్ సిస్టమ్, తాగు నీరు, వాటర్ ట్యాంకర్లు తదితర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నగర ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నగర ప్రజలందరికి మేయర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

