కలం, వెబ్ డెస్క్: అరుణాచల్ ప్రదేశ్‌లో 50 కిలోమీటర్ల మేర చైనా సైన్యం ఆక్రమించిందంటూ వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్టులు ఫేక్ అని ఇండియన్ ఆర్మీ (Indian Army) స్పష్టం చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు చెందిన కొందరు సోషల్ మీడియా హ్యాండ్లర్లు ఇలాంటి ఫేక్ పోస్టులను వైరల్ చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. భారత జవాన్లను చైనా సైనికులు ఓడించారని, అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ఆక్రమించుకుంటోందని, ఇండియా భూభాగంలో చైనా సైన్యం తిష్ట వేసిందంటూ ఫేక్ పోస్టులు క్రియేట్ చేస్తున్నారని స్పష్టం చేసింది.
ఫేక్ ప్రచారం చేస్తున్న ఆరు ఎక్స్ అకౌంట్లను కేంద్ర ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ గుర్తించిందని ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. భారత వ్యతిరేక ప్రచారంలో భాగంగా నిర్దిష్ట పద్ధతిలో ఇలాంటి ఫేక్ పోస్టులు వైరల్ చేస్తున్నారని వివరించింది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు, నెటిజన్లు నమ్మవద్దని స్పష్టం చేసింది. సైన్యానికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారమైనా.. అధికారిక హ్యాండిళ్ల నుంచి అందిస్తామనే విషయాన్ని గమనించాలని ఫ్యాక్ట్ చెక్ విభాగం కోరింది.
ఢిల్లీలో ర్యాలీపై కూడా..
భారత్ లక్ష్యంగా కొన్నాళ్లుగా పాకిస్థాన్ సోషల్ మీడియా హ్యాండ్లర్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలో ఇండియా కూటమి (INDIA Bloc) నిర్వహించిన ర్యాలీపై కూడా ఇలాగే ఫేక్ పోస్టులు పెట్టారని వివరించింది. ఢిల్లీలో కురిసిన వర్షానికి రాంలీలా మైదానంలో కొంత భాగం బురదగా మారింది. దీన్ని పాకిస్థాన్ వ్యక్తులు ఇండియన్ ఆర్మీ (Indian Army) సాయంతో బీజేపీ ప్రభుత్వం రాంలీలా మైదానంలో సభ జరగకుండా బురద పోసిందని ఫేక్ పోస్టులు పెట్టారని వివరించింది. జెన్ జీని ఆందోళనలు చేయకుండా కట్టడి చేస్తున్నారని అబద్ధపు ప్రచారాలు చేస్తూ.. యువతకు ఆర్మీపై వ్యతిరేకత వచ్చేలా కుట్రలు చేస్తున్నారని.. ఇలాంటి ఫేక్ పోస్టులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Also Read : ప్రతి అంశంపైనా దర్యాప్తు చేయలేరు.. ఈడీకి హైకోర్టు స్పష్టీకరణ
Follow Us On: Youtube

