కలం, ఆదిలాబాద్ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Voter List Revision) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగింపునకు గురైన వారికి తమ ఓటు హక్కును తిరిగి పొందేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఎస్డీ జాబితాలో పేర్లు ఉన్నవారు మరోసారి ఎన్యుమరేషన్ ఫారం నింపి సమర్పించడం ద్వారా ఓటరు జాబితాలో తమ పేరును పునరుద్ధరించుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్న అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఏఎస్డీ జాబితాను ప్రతి పోలింగ్ కేంద్రం, గ్రామపంచాయతీ నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు, ఓటర్లందరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఏఎస్డీ జాబితాలో పేర్లు ఉండి, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు నిబంధనల ప్రకారం ఫారం-సి ద్వారా మరోసారి ఎన్యుమరేషన్ ఫారం సమర్పించవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియపై నియోజకవర్గ, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పూర్తి వివరాలను తెలియజేయాలని ఆదేశించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా చర్యలు చేపట్టి, ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు గురైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు రెవెన్యూ కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, డీఆర్ఓ స్రవంతి, ఎన్నికల పర్యవేక్షణ అధికారి నలందప్రియ, నాయబ్ తహసీల్దార్ మధుసూదన్, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

