వెలుగుల వెనుక చీకటి: కనుమరుగవుతున్న వారసత్వ వృత్తి!

కలం, నిజామాబాద్ బ్యూరో: దీపావళి అంటేనే దీపాలు, వెలుగులు. పండుగ రోజున ఇండ్లలో ప్రమిదలు వెలిగించడంతో ఇల్లంతా మెరిసిపోతుంది. కానీ, ఆ దీపాలను తయారు చేసిన చేతులు మాత్రం చీకట్లో మగ్గిపోతున్నాయి. ఒకప్పుడు దీపావళి వచ్చిందంటే కుమ్మరుల ఇండ్లల్లో పండుగ వాతావరణం ఉండేది. కానీ నేడు పండుగ వచ్చిందంటేనే వారు భయపడే పరిస్థితి నెలకొన్నది.

రోడ్లపై, దుకాణాల్లో, షాపింగ్ మాల్స్‌లో ఎక్కడ చూసినా యంత్రాలతో తయారైన ప్రమిదలే అమ్ముడవుతున్నాయి. అవి ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లతో ఉండటం ఇందుకు కారణం. దీనికి తోడు చైనా లైట్లు, ప్లాస్టిక్, ఎల్ఈడీ దీపాల రాకతో సంప్రదాయ మట్టి ప్రమిదలు కనుమరుగవుతున్నాయి. ఎటు చూసినా కెమికల్స్ తో తయారు చేసిన ప్రమిదలే మార్కెట్లోకి వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా మట్టినే నమ్ముకున్న కుమ్మరుల జీవితాలు మట్టిలోనే మగ్గిపోతున్నాయి.

నాడు కళకళ.. నేడు వెలవెల

నాడు దివ్వెలు కావాలంటే కుమ్మరుల ఇండ్లను వెతుక్కుంటూ వెళ్లేవారు. దీపావళికి నాలుగైదు రోజుల ముందు, కార్తీక మాసం ప్రారంభానికి వారం ముందే ప్రమిదలు తీసుకొచ్చేవారు. ఇల్లంతా, ఆరుబయట, ఇంటి ముందున్న గోడల మీద దీపాలు పెట్టి వెలిగించేవారు. ఆ దీపాల వెలుగు వీధంతా కనిపించేది. అలా కుమ్మరుల జీవితాలు కూడా వెలిగిపోయేవి. నాడు ఆ కుటుంబాలు చేతినిండా పనితో కళకళలాడేవి.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 30కి పైగా కుమ్మరి కుటుంబాలు దీపావళికి ప్రమిదలు, కంచులు, దొంతులు తయారు చేసి అమ్మేవారు. కార్తీక మాసం రాగానే తులసి చెట్ల కుండీలు, ప్రమిదలు విక్రయించేవారు. కుటుంబంలో 10 మంది రాత్రింబవళ్లు పని చేసినా సరిపోకపోయేదని నిజామాబాద్‌లోని ప్రస్తుత తయారీదారులు చెబుతున్నారు. ఇప్పుడు కేవలం ఐదు కుటుంబాల వారే ఈ పని చేస్తున్నారని, అందులోనూ ఒక్కరే పని చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘మట్టి’నే నమ్ముకున్న ‘మనుషులు’

చేతివృత్తులలో కుమ్మరి (Nizamabad Potters) వృత్తి చెప్పుకోదగినది. పుట్టుక, పెండ్లి, చావు వంటి ప్రధాన ఘట్టాలలో వీరి పాత్ర ఎంతో కీలకం. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ వృత్తిదారులు నేడు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థికంగా ఎదగలేక, రోజు గడిస్తే చాలన్నట్టుగా బతుకులీడుస్తున్నారు. మారిన కాలానికి అనుగుణంగా అన్ని ధరలు పెరిగినట్టే, అడవి నుంచి తీసుకొచ్చే బంకమట్టి ధర కూడా పెరిగింది. ఒక ట్రాక్టర్ మట్టి ధర రూ.5వేల నుంచి రూ.6వేల పలుకుతున్నది. కలర్స్ ధరలు పెరిగి, ఒక్కో రంగు సంచి రూ.850కి చేరింది. వార్నిష్, దొంతులకు వాడే స్టోన్స్, గమ్ ధరలన్నీ భారీగా పెరిగాయి.

3 నెలల ముందు నుంచే పనులు

దీపావళి, సంక్రాంతి, కార్తీక మాసం పండుగల కోసం 3 నెలల ముందు నుంచే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుటుంబమంతా పనుల్లో నిమగ్నమవుతారు. ప్రమిదలు, కుండలు, దొంతుల తయారీ కోసం మట్టిని పిసికి, తొక్కి మెత్తగా చేస్తారు. ఆపై వాటిని తయారు చేసి బట్టీలలో కాలుస్తారు. తర్వాత వాటికి సున్నం, రంగులు వేసి ఎండబెట్టి అమ్మకానికి సిద్ధం చేస్తారు. అయితే, నేడు అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడంతో కుమ్మరుల జీవితాలు కళ తప్పి వెలవెలబోతున్నాయి. మట్టినే నమ్ముకుని చేస్తున్న వారసత్వ చేతివృత్తి ఉపాధి కనుమరుగవుతున్నది.

ఎటు చూసినా మెషీన్ దీపంతాలు

ఇప్పుడు దేశమంతా మెషీన్ దీపంతాలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రా, తెలంగాణ.. ఎక్కడ చూసినా రోడ్లపై, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో పెద్ద ఎత్తున వాటినే అమ్ముతున్నారు. కోల్కతా, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న ఈ మెషీన్ దీపంతాలు కుమ్మరి వృత్తిని నమ్ముకున్న కుటుంబాలను ఛిన్నాభిన్నం చేశాయి. అవి కెమికల్స్తో తయారయ్యాయా.. లేక సహజసిద్ధంగా మట్టితో చేశారా.. అని ప్రజలు ఆలోచించడం లేదు. రంగురంగుల్లో మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపించడంతో వాటినే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. అసలు కుమ్మరి వారు దీపంతాలు తయారు చేసి అమ్ముతారనే విషయం ఇప్పటి తరానికి తెలియదని తయారీదారులు అంటున్నారు.

మేం ఎలా బతకాలి? :జానకీ రామ్, నిజామాబాద్

ఇంతకుముందు దీపావళి, ఇతర పండుగల సమయంలో ప్రజలు మా దగ్గరికే వచ్చి దీపంతాలు, కుండలు, దొంతులు తీసుకెళ్లేవారు. ఇప్పుడు దిగుమతి చేసుకున్న కెమికల్ మెషీన్ దీపంతాలను రోడ్లపై, షాపింగ్ మాల్స్‌లో అమ్ముతున్నారు. ఇక మా దగ్గరికి ఎవరు వస్తారు? మేం ఎలా బతకాలి? ప్రభుత్వమే మాలాంటి చేతివృత్తుల వారికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి, అమ్మకాల కోసం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఉచిత గదులు ఇచ్చి ప్రోత్సహించాలి. అలా మా కుటుంబాలను ఆదుకోవాలి.

తప్పక వారసత్వంగా చేస్తున్నాం :సుశీల, నిజామాబాద్

మా అత్తమామల కాలం నుంచి.. 40 ఏండ్లుగా నేను ఈ పనులు చేస్తున్న. దీపంతాల ధర డజను రూ.100 చెప్తే.. రూ.40కి ఇవ్వమని అడుగుతున్నారు. ఇందులో ఏం లాభం లేదు. కులవృత్తి కావడంతో వారసత్వంగా వస్తున్న ఈ పని తప్పక చేయాల్సి వస్తున్నది. మేం ఎంతో కష్టపడి మట్టి పని చేసి, ఒక్కో ప్రమిదను తయారు చేసి వందల సంఖ్యలో అమ్మితే కానీ డబ్బులు రావు. పండుగల సమయంలోనే కాస్త డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు అవి కూడా అమ్మకాలు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మా కోసం ఏదైనా కొత్తగా ఆలోచించి ఆదుకోవాలి.

మట్టి లేనిదే మనుగడ లేదు :రాజు, నిజామాబాద్

మట్టి లేనిదే మనుషుల మనుగడ లేదు. మట్టిలోనే పుడతాం, మట్టిలోనే కలిసిపోతాం. అలాంటి మట్టితో మా జీవితాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఆ మట్టికి, మాకు విలువ లేకుండా పోయింది. మా కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదు. మట్టి విలువను, మమ్మల్ని గుర్తించాలి. కులవృత్తులను ప్రోత్సహించాలి. మాకు పనులు చేసుకోవడానికి ప్రత్యేక స్థలాలు ఇచ్చి, ఉపాధి కల్పించాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>