కలం, ఖమ్మం బ్యూరో: సెల్ ఫోన్లు, చిన్నచిన్న బహుమతుల ఆశ చూపించి ఓ కామాంధుడు పసి ప్రాయంలోని బాలిక జీవితంతో చెలగాటమాడాడు. నమ్మకమైన బంధువే కామంతో కళ్లుమూసుకుని అఘాయిత్యానికి పాల్పడటంతో పదమూడేళ్ల బాలిక గర్భం దాల్చిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం (Tirumalayapalem) మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.తిరుమలాయపాలెం మండలానికి చెందిన 13 ఏళ్ల బాలిక.. పొరుగు జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న బాలిక, సెలవు రోజుల్లో ఇంటికి వచ్చి వెళ్తుండేది.
అదే గ్రామానికి చెందిన, బాధితురాలికి సమీప బంధువు, అవివాహితుడైనా బోడ రమేష్(32) ఈ దారుణానికి ఒడిగట్టాడు. సెలవులకు ఇంటికి వచ్చిన బాలికపై కన్నేసిన నిందితుడు రమేష్.. ఆమెకు ఒక సెల్ ఫోన్, తరచూ చిన్నచిన్న బహుమతులు అందిస్తూ మాయమాటలు చెప్పాడు. అలా అమాయకురాలైన బాలికను నమ్మించి లోబరుచుకున్నాడు. కొద్ది రోజులుగా బాలిక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించి అసలు నిజాన్ని బయటపెట్టారు. పరీక్షల్లో బాలిక గర్భం దాల్చినట్లు తేలడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కూసుమంచి సీఐ సంజీవ్, తిరుమలాయపాలెం ఎస్సై సురేష్ గ్రామంలో విచారణ చేపట్టి, బాధితురాలి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. నిందితుడు బోడ రమేష్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. చదువుకోవాల్సిన వయసులో బాలిక పట్ల రాక్షసంగా ప్రవర్తించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

