కలం, ఖమ్మం బ్యూరో: దీపావళి పండుగ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులు నిల్వ ఉంచి విక్రయిస్తున్న వారిపై ఖమ్మం పోలీస్ (Khammam Police) కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఖమ్మం నగరంలోని బుర్హన్పురంలో ఉన్న నాగ వెంకటసాయి కిరాణా దుకాణంలో పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.
అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ సీఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి లైసెన్సులు లేకుండా నిల్వ ఉంచిన సుమారు రూ. 1. 75లక్షల విలువైన దీపావళి టపాసులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఆ సామగ్రిని పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులను నిల్వ చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లేలా నిబంధనలను ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులోనూ కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజలందరూ దీపావళి పండుగను సురక్షితంగా, సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.
కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు కలిగిన అధీకృత విక్రయ కేంద్రాల నుంచే టపాసులు కొనుగోలు చేయాలని కోరారు. ఎక్కడైనా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.

