కలం, వెబ్ డెస్క్: కేరళ కాంగ్రెస్ పార్టీపై సుప్రీం కోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్(CJI Surya Kant)ను ఉద్దేశించి ఎక్స్‌లో చేసిన పోస్టును తీవ్రంగా పరిగణించిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎం.పంచోలితో కూడిన ధర్మాసనం కేరళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సహా ఆఫీస్ బేరర్లకు నోటీసులు జారీ చేసింది. సీజేఐని టార్గెట్ చేసిన ఈ అంశంలో మీపై ఎందుకు క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోకూడదో చెప్పాలని స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను తాకట్టు పెట్టలేమని, అలాగే న్యాయ వ్యవస్థను బెదిరించేందుకు భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుగా పెట్టుకోవద్దని హితవు పలికింది.
రాజ్యాంగమే సుప్రీం..
జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎం.పంచోలితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. “సుప్రీం కోర్టు తీర్పులపై సద్విమర్శలను ఎప్పటికీ ఆహ్వానిస్తుంటాం. అంతే తప్ప వారు ఎంత శక్తివంతమైన వ్యక్తులు, సంస్థలు అయినా భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డు పెట్టుకుని న్యాయ వ్యవస్థను నిందిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. సుప్రీం కోర్టుకు రాజ్యాంగం మాత్రమే సుప్రీం అనే విషయం మర్చిపోవద్దు. ఏ సంస్థ లేదా రాజకీయ పార్టీ అయినా రాజ్యాంగం కంటే తామే ఎక్కువని భావించవద్దు. న్యాయ వ్యవస్థ అధికారాన్ని తక్కువ చేసే ఎలాంటి చర్యలనైనా ఉక్కుపాదంతో అణచివేయాలి” అని ధర్మాసనం తేల్చి చెప్పింది.
అసలేం జరిగిందంటే..
అక్టోబర్ 12న కేరళ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎక్స్ పోస్ట్ వివాదానికి కారణమైంది. “డియర్ సూర్యకాంత్.. శాంతి భద్రతల అంశం సుప్రీం కోర్టు పరిధిలోకి రావని మీరు భావిస్తే.. వెంటనే రాజీనామా చేయండి. మీ స్థానంలో మరో సరైన వ్యక్తిని అక్కడ కూర్చోబెడుతాం” అని పోస్ట్ చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా లాయర్లు, న్యాయ నిపుణులు భగ్గుమన్నారు. దిద్దుబాటు చర్యలు చేపట్టిన కాంగ్రెస్.. తమ అనుమతి లేకుండా సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్న వ్యక్తి పోస్ట్ చేశాడని.. వెంటనే అతడిని తొలగించామని వివరణ ఇచ్చింది.
దీనిపై సుప్రీం కోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు కాగా విచారించిన సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ పోస్ట్ అనధికారికంగా పెట్టారని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ (Sunny Joseph) క్షమాపణలు చెప్పినా.. ధర్మాసనం పట్టించుకోలేదు. ఈ విషయంలో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ అడ్వకేట్‌ను నియమించడంతో పాటు అటార్నీ జనరల్ అభిప్రాయం కూడా కోరింది. ఇలాంటివి ఉపేక్షిస్తే రేపు మరో రాజ్యాంగబద్ధమైన సంస్థకు ఇదే పరిస్థితి రావొచ్చని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read : బీసీ స్టడీ సర్కిల్ స్టైపెండ్ పెంపు.. ఈ నెలనుంచే అమల్లోకి: పొన్నం
Follow Us On : WhatsApp

