కలం, తలమడుగు: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గిరిజన పల్లెలు పుట్టినిల్లుగా నిలుస్తున్నాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. శుక్రవారం తలమడుగు మండలం పాల్సి (కె), పునగూడ గ్రామాల్లో నిర్వహించిన దండారి (గుస్సాడి) ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ కళాకారులతో కలిసి సంప్రదాయ దండారి నృత్యాలు చేస్తూ ఉత్సవాల్లో సందడి చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద ఆదివాసీ పండుగగా పేరొందిన దండారి (గుస్సాడి) ఉత్సవాలు వారి సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు, కళలు ఎంతో విశిష్టమైనవని అన్నారు. దండారి ఉత్సవాలు ఆదివాసీల ఐక్యతకు, కళా వైభవానికి నిదర్శనమని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ గొప్ప వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆదివాసీ సంస్కృతి విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పాలని ఆకాంక్షించారు.

