కలం, నల్లగొండ : ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన తెలుగు విద్యార్థిని శ్రీజ రెడ్డి కోయ (Sreeja Reddy) (23) అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. గత 36 గంటలకు పైగా ఆమె ఆచూకీ లభించకపోవడంతో అటు అమెరికాలోని ఆమె స్నేహితులు, ఇటు నల్లగొండ జిల్లాలోని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన యాదగిరిరెడ్డి, రూప దంపతుల కుమార్తె శ్రీజ రెడ్డి ఉన్నత చదువుల కోసం ఏడాది క్రితం ఎఫ్-1 వీసాపై అమెరికా వెళ్లారు.
ప్రస్తుతం ఆమె మసాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తూనే పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు. నవంబర్ 2 (సోమవారం) రాత్రి 9:45 గంటల సమయంలో ఎడిసన్ గ్రీన్ ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లిన శ్రీజ, ఆ తర్వాత తిరిగి రాలేదు. మరుసటి రోజు ఉదయానికి కూడా ఆమె అపార్ట్‌మెంట్‌కు చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన సహచర స్నేహితులు బోస్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
శ్రీజ సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా లొకేషన్‌ను ట్రేస్ చేయగా, బోస్టన్ దక్షిణ భాగంలో ఉన్న స్క్వాంటమ్ ఛానల్ బీచ్ ప్రాంతాన్ని చూపించినట్లు అధికారులు గుర్తించారు. సుమారు 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉండే శ్రీజ రెడ్డి ఆచూకీ కోసం స్థానిక పోలీసులు సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు విడుదల చేశారు. ఆమె గురించి ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే 911 అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు అందించాలని కోరారు.
ఈ సమాచారం అందుకున్న నల్లగొండలోని శ్రీజ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలసి సహాయం చేయాలని కోరారు. మంత్రి స్పందించి విదేశాంగ శాఖ, అమెరికాలోని సంబంధిత అధికారులతో మంతనాలు జరిపి గాలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బోస్టన్‌లోని తెలుగు కమ్యూనిటీ శ్రీజ ఆచూకీ కోసం శ్రమిస్తోంది. అయితే, శ్రీజకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, అపార్ట్‌మెంట్ చిరునామాలు లేదా లొకేషన్ యాప్ స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో బహిరంగంగా పంచుకోవద్దని పోలీసులు హెచ్చరించారు.
Also Read : బెంగళూరులో దారుణం: ఒకే కుటుంబంలో ఏడుగురి హత్య!
Follow Us On : WhatsApp

