epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

యాదగిరిగుట్టలో గూడుపుఠాణీ.. ఆల‌యంలో ఏం జ‌రుగుతోంది!

కలం, నల్లగొండ బ్యూరో : యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నృసింహాస్వామి ఆలయంలో రాజకీయం రంజుగా మారింది. కేవలం ఓ ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఆలయ నిర్వహణ సాగడం లేదనే అక్కసుతో ఈఓ వెంకట్రావు సైతం రాజీనామా చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. తొలిసారిగా ఐఏఎస్ స్థాయి అధికారి యాదగిరిగుట్ట ఆలయానికి ఈఓగా నియామకమయ్యారు. దీంతో యాదగిరిగుట్ట ఆలయంపై ఐఏఎస్ స్థాయి కొద్ది రోజుల్లోనే స్పష్టంగా కన్పించింది. కానీ అతి తక్కువ కాలంలోనే ఆ ఐఏఎస్ అధికారి తనంతట తానుగా అనారోగ్యం బాలేదంటూ రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఈ వ్యవహరమంతటికీ కారణం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అనే ఆరోపణలు లేకపోలేదు. ఆలయ నిర్వహణలో మితిమీరిన జోక్యం.. తన పంతం నెగ్గాలనే కోణంలో ఆలయ పాలన గాలికొదిలేసినట్టయ్యింది. ఈఓ వెంకట్రావు తనకు అనుకూలంగా వ్యవహరించకపోవడం వల్లే ఎమ్మెల్యే బీర్ల ఈఓను తప్పించారనే ఆరోపణలు లేకపోలేదు.

సీఎం రేవంత్‌కు ఆహ్వానం ఇవ్వడమే కొంపముంచిందా?

ఇటీవల వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో యాదగిరిగుట్ట ఆలయానికి రావాలంటూ ఈఓ వెంకట్రావు ఒక్కరే వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని కలిసి ఆహ్వానించారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సీరియస్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా సీఎం రేవంత్‌ను కలవడంపై గరం అయ్యారు. దీనికితోడు ఈఓ వెంకట్రావు.. ఆలయ ఆదాయాన్ని పెంచడంలో భాగంగా ఇటీవల యాదగిరిగుట్ట టెంపుల్‌పైకి వచ్చే సిఫారసు వాహనాలను ఎవరూ పంపిస్తున్నారనే పేర్లను నమోదు చేయాలని, రిజిష్టర్ మెయింటెన్ చేయాలంటూ ఆదేశించారు.

గుట్టపైకి ఫ్రీగా (సిఫారసు) వచ్చే వాహనాల్లో ఎమ్మెల్యే బీర్ల, ఆయన అనుచరులు, పోలీసు శాఖ అధికారుల నుంచి వస్తున్నట్టు తేలింది. ఇదీకాస్త ఎమ్మెల్యే అయిలయ్య, ఈఓ వెంకట్రావుకు మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది. ఇటీవల జిల్లా ఇంఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ యాదగిరిగుట్టకు వచ్చిన సందర్భంలోనూ ఎమ్మెల్యే అయిలయ్యను ఈఓ వెంకట్రావు పట్టించుకోలేదని ఆరోపణలు లేకపోలేదు.

మళ్లీ ఈఓగా భాస్కర్‌రావు..?

యాదగిరిగుట్ట టెంపుల్‌పై పట్టు కోసం ఎమ్మెల్యే అయిలయ్య తీవ్రంగా ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆలయ నిర్వహణతో పాటు పాలన వ్యవహారాల్లోనూ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆలయ ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఐఏఎస్ స్థాయి ఈఓ వెంకట్రావు పాలనలో టెంపుల్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అవి ఎమ్మెల్యే బీర్లకు నచ్చలేదు. దీంతో ఆయనపై తీవ్రంగా ప్రెజర్ తెచ్చి అనారోగ్య కారణాల పేరుతో రాజీనామా చేయించారు. నిజంగా అనారోగ్య కారణాలైతే.. వెంకట్రావు ఐఏఎస్‌గా రిటైర్ అయ్యి నిండా మూడు నెలలు కావట్లేదు. రిటైర్‌మెంట్ తర్వాత ప్రభుత్వం ఆలయ ఈఓగా నియమించిన సమయంలోనే ఆయన తిరస్కరించేవారు. కానీ ఈ తరహాలో రాజీనామా చేసి ఉండేవారు కాదనే చర్చ లేకపోలేదు.

ఇదిలావుంటే.. యాదగిరిగుట్ట ఆలయానికి కొత్త ఈఓగా గతంలో పనిచేసిన భువనగిరి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావునే మళ్లీ తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తన ఓన్ ఇంట్రెస్ట్‌తో భాస్కర్‌రావును తీసుకువస్తుండడంపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో భువనగిరి అదనపు కలెక్టర్‌గా పనిచేసిన భాస్కర్‌రావు.. ఆ తర్వాత యాదగిరిగుట్ట ఈఓగా బదిలీ అయ్యారు. మళ్లీ అక్కడి నుంచి అదే భువనగిరి అదనపు కలెక్టర్‌గా జాయిన్ అయ్యారు. మళ్లీ ఇప్పుడే టెంపుల్ ఈఓగా ఒకట్రెండు రోజుల్లోనే ఉత్తర్వులు రానున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతటికీ బీర్ల అయిలయ్య కారణమని తెలుస్తోంది. అంతగా భాస్కర్‌రావు జిల్లాను అంటిపెట్టుకుని ఉండడం పట్ల ఆంతర్యం ఏముందోననే గుసగుసలు జోరందుకున్నాయి.

Yadagirigutta
Yadagirigutta

Read Also: ఉర్దూ వర్శిటీ భూములపై సర్కారు కన్ను

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>