అక్రమ టపాసుల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం

కలం, ఖమ్మం బ్యూరో: దీపావళి పండుగ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులు (Illegal Firecrackers) నిల్వ ఉంచి విక్రయిస్తున్న వారిపై ఖమ్మం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలోని చర్చికాంపౌండ్ రోడ్డులో రంగచారి హాస్పిటల్ ఎదురుగా ఉన్న నల్లా బాలకృష్ణ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులపై టాస్క్‌ఫోర్స్ సీఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.లక్ష విలువైన టపాసులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం వాటిని ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎలాంటి లైసెన్సులు, అనుమతులు లేకుండా నివాస ప్రాంతాల్లో టపాసులను నిల్వ ఉంచడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లేలా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ సురక్షితంగా, ఆనందంగా దీపావళి పండుగను జరుపుకోవాలని సూచించారు. కొనుగోలుదారులు కేవలం ప్రభుత్వ అనుమతి పొందిన అధికారిక విక్రయ కేంద్రాల నుంచే టపాసులు కొనుగోలు చేయాలని కోరారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా టపాసుల నిల్వలు లేదా విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>