కలం, నిర్మల్: డిజిటల్ గవర్నెన్స్‌లో (Digital Governance) భాగంగా అమలు చేస్తున్న ఈ-కార్నర్, ఈ-సాంక్షన్, వామ్స్ మాడ్యూల్స్‌పై ఉద్యోగులకు అందిస్తున్న శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఖజానా శాఖ అధికారి సరోజ సూచించారు. గురువారం నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందించడం, పనితీరులో వేగం, ఆర్థిక లావాదేవీల్లో సమర్థత సాధించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని సరోజ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా పే అండ్ అకౌంట్స్ అధికారి చంద్రశేఖర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగులకు ఆయా మాడ్యూల్స్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, ఎస్టీఓ రమేష్, ముథోల్ ఎస్టీఓ జయరాం, భైంసా ఎస్టీఓ నజీమ్, ఖానాపూర్ ఎస్టీఓ మనోహర్, శశి, తోట సృజన్ తదితరులు పాల్గొన్నారు.

