కలం, నిజామాబాద్ బ్యూరో: బియ్యం ధరలను తక్షణమే నియంత్రించాలని, అక్రమంగా నిలువ చేసిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ (CPI-ML) పార్టీ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో గత నెల రోజులుగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు, పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత నెల వరకు 26 కిలోల బియ్యం బస్తా ధర రూ.1,200 నుంచి రూ.1,600 వరకు ఉండగా, ప్రస్తుతం అదే బస్తా ధర రూ.2,200 నుంచి రూ.2,600 వరకు పెరిగిందన్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో ఇంత భారీగా ధరలు పెరగడం సామాన్య ప్రజలకు తీవ్ర భారంగా మారిందన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే పెరిగిన నేపథ్యంలో బియ్యం ధరలు కూడా ఇష్టానుసారంగా పెరగడం వల్ల పేద ప్రజల జీవన పరిస్థితులు మరింత దుర్భరంగా మారుతున్నాయన్నారు. అందువల్ల నిజామాబాద్ జిల్లాలో బియ్యం ధరలను తక్షణమే నియంత్రించాలన్నారు. ప్రభుత్వం హెచ్‌ఎంటీ రకం బియ్యాన్ని కిలో రూ.66 చొప్పున అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఆ నిర్ణయాన్ని నిజామాబాద్ జిల్లాలో తక్షణమే అమలు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అదేవిధంగా బియ్యం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం, నిల్వలు దాచిపెట్టి అధిక ధరలకు విక్రయించడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడటం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని జేసీ దృష్టికి తీసుకొచ్చారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సంధ్యారాణి, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గణేష్, అనిల్, నాయకులు అమూల్య, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

