కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్న తరుణంలోనే ఆ పార్టీకి (Khammam BRS) కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాలో పార్టీని సమాయత్తం చేసేందుకు కేటీఆర్ అడుగుపెట్టకముందే, కీలక నేతలు కారు దిగి హస్తం గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం కార్పొరేషన్‌కు చెందిన ఐదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం నగరాభివృద్ధిలో మంత్రి తుమ్మల అనుసరిస్తున్న వ్యూహాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో వీరు పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ చేరుకున్న నేతలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు.
ఈ పరిణామంతో 12వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ల లక్ష్మి, 17వ డివిజన్ ప్రతినిధి డోర్నల రాధ, 25వ డివిజన్ నుండి గోళ్ళ చంద్రకళ, 40వ డివిజన్ కు చెందిన దాదె అమృత, 55వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి ఇప్పుడు అధికార పార్టీ సభ్యులుగా మారారు. తాము కాంగ్రెస్‌లో చేరుతున్న విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఈ పరిణామం జిల్లా బీఆర్ఎస్(BRS) శ్రేణులను ఆత్మరక్షణలో పడేయగా, మంత్రి తుమ్మల చొరవతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది.

Read Also: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫిర్యాదు
Follow Us On: X(Twitter)


