కలం, సినిమా: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సామాజిక సంస్థ డెమోక్రటిక్ సంఘా (Democratic Sangha) నుంచి తప్పుకుంటున్నట్లు హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina Cassandra) తెలిపారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించారు. డెమోక్రటిక్ సంఘాకు సహ వ్యవస్థాపకురాలిగా, సభ్యురాలిగా కొనసాగిన తాను ఇకపై ఆ సంస్థతో పాటు దాని అనుబంధ కార్యక్రమాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఎంతో ఆలోచించి, ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత తీసుకున్నట్లు పేర్కొన్నారు. డెమోక్రటిక్ సంఘాతో తన ప్రయాణం ఎంతో విలువైనదని, ఈ క్రమంలో ఎన్నో అనుభవాలు, స్నేహాలు, మధుర జ్ఞాపకాలు సొంతమయ్యాయని రెజీనా తెలిపారు. ఆ సంస్థ స్థాపక ప్రయాణంలో భాగం కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇన్నాళ్లూ తనకు మద్దతుగా నిలిచిన వాళ్లందరికీ తెలిపారు. డెమోక్రటిక్ సంఘా భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు.
డెమోక్రటిక్ సంఘా అనేది హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సామాజిక సంస్థ. ప్రజల్లో ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంచడం, మహిళలు, యువతలో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. సామాజిక కార్యకర్త చైతన్య ఎంఆర్ఎస్‌కే ఈ సంస్థను స్థాపించారు. రెజీనా సహ వ్యవస్థాపకురాలిగా ఇందులో భాగమయ్యారు. 2023లో సంస్థ కార్యకలాపాల్లో భాగమైన రెజీనా, గ్రామీణ మహిళల నాయకత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. 2024లో ఆమె సహ వ్యవస్థాపకురాలిగా కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు రెజీనా అకస్మాత్తుగా ఈ సంస్థ నుంచి ఎందుకు తప్పుకున్నారన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

