epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తమిళనాట సంచలనం.. విజయ్‌తో కమలం దోస్తీ ?

కలం డెస్క్: పాపులర్ తమిళ్ స్టార్ దళపతి విజయ్  (Thalapathy Vijay) బీజేపీతో పొత్తుపెట్టుకోనున్నారా? మొదటి నుంచి బీజేపీ పేరెత్తితేనే అంతలా కాలుదువ్వుతూ వస్తున్న ఆయన.. కమలంతో దోస్తీ కట్టనున్నారా?.. ప్రస్తుతం మదరాసీల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు రెడీగా ఉండాలని బీజేపీ రాష్ట్ర నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశా నిర్దేశం చేసినట్లు వార్తలు చక్కర్లు కొడ్తున్నాయి.

మొదటి నుంచీ బీజేపీపై ‘మాస్టర్’ గుస్సా

తమిళనాడులో పుట్టిపెరిగిన చాలా పార్టీలు మొదటి నుంచి బీజేపీ అంటే అంటీముట్టనట్లుగానే ఉంటున్నాయి. బీజేపీ అంటే నార్త్ కాషాయమని.. సౌత్ గురించి ఆ పార్టీకి ఏ మాత్రం పట్టింపు ఉండదని మండిపడుతుంటాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం కొన్ని పార్టీలు అడపాదడపా మద్దతిస్తున్నప్పటికీ.. వ్యతిరేకించే తమిళపార్టీలే ఎక్కువ! అందులో విజయ్ పార్టీ కూడా ముందు వరుసలో ఉంది. విజిల్, మాస్టర్, బీస్ట్ వంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచుతుడైన విజయ్.. 2024 ఆగస్టు 22న ‘తమిళగ వెట్రి కళగం (TVK)’ పార్టీని స్థాపించినప్పటి నుంచి బీజేపీ, డీఎంకే తనకు శత్రువులు అని చెప్తూ వచ్చారు. అదే ఏడాది జరిగిన తొలి బహిరంగ సభలోనూ ఇదే తేల్చిచెప్పారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటిస్తూ వచ్చారు. అలాంటి విజయ్‌తో పొత్తుకోసం అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా?!! దగ్గరవుతాడా? నిరుడు సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ చేపట్టిన బహిరంగ సభ తీవ్ర విషాదాన్ని నింపింది. అక్కడ తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దళపతిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి విజయ్ పెద్దగా జనంలోకి రావడం లేదు. ఎలాగైనా తమిళనాడులో సీఎం కుర్చీని చేపట్టి.. తానేంటో నిరూపించుకోవాలని చూస్తున్న ఆయనకు ఆ ఘటన తీవ్రంగా కలవరపరించింది. ఇప్పుడు బీజేపీతో అడుగులు వేస్తే ఏమైనా ఫాయిదా ఉంటుందా..? అని టీవీకే శ్రేణులు కూడా ఆలోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

విజయ్ వైపు షా ఫోకస్ ఎందుకు?

ఇటీవల తమిళనాడు పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ కోర్ కమిటీ నేతలతో భేటీ అయ్యారు. ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని.. కనీసం అధికారంలో భాగస్వామ్య పాత్ర అయినా పోషించాలని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ‘‘గెలుపే లక్ష్యంగా పనిచేయండి. సెంటిమెంట్లకు తావు లేదు. కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్లండి” అని నేతలకు తేల్చిచెప్పారు. సెంటిమెంట్లను నమ్ముకుంటే పనికాదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని అధికార డీఎంకేను ఢీకొనాలంటే ఏం చేయాలంటూ నేతలతో చర్చించారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేతో దోస్తీ కడ్తే ఫలితం ఉంటుందని నేతలు చెప్పినట్లు సమాచారం.

ఎన్డీయే కూటమిలోకి విజయ్‌ని ఆహ్వానించాలని, ఈ బాధ్యతలను తీసుకోవాలని రాష్ట్ర బీజేపీలోని కీలక నేతలకు షా సూచించినట్లు తెలుస్తున్నది. కాగా, అమిత్ షా పర్యటనలో ఎన్డీయే కూటమిలోని అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే నేపథ్యంలో అమిత్ షా.. ఎన్డీయే కూటమి కేవలం ఒక పార్టీకో, వ్యక్తికో పరిమితం కాదని.. డీఎంకేను వ్యతిరేకించే అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించినట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు డీఎంకే వర్సెస్ ఎన్డీయేగా సాగాలని తేల్చిచెప్పినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే విజయ్ వైపు బీజేపీ అడుగులు వేస్తున్నట్లు తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అన్నట్లు.. అటు బీజేపీకి, ఇటు విజయ్ పార్టీ టీవీకేకు ఉమ్మడి శత్రువైన డీఎంకేను ఢీకొట్టాలంటే బీజేపీ, టీవీకే మిత్రులుగా మారొచ్చని చెన్నై రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.  పాలిటిక్స్‌లో  ఏదైనా సాధ్యమేనని, ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చని అంటున్నాయి. చూడాలి.. ఏం జరుగుతుందో! ఈ ఏడాది ఏప్రిల్, మేలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో? ప్రీ-పోల్ అలయెన్స్ ఉంటుందా?.. లేక ఓటు బ్యాంకును ఆకర్షించుకోడానికి పోస్ట్-పోల్ అలయెన్స్ ఫార్ములా అమలవుతుందా?.. ఇదీ తమిళనాట ఆసక్తికర చర్చ.

Thalapathy Vijay
Thalapathy Vijay

Read Also: టీమిండియా క్రికెటర్​కి ఈసీ నోటీసులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>