కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్ వేదికగా నవంబర్ 1న కాంగ్రెస్, ఇండి కూటమి సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ (Congress Rally Delhi)కు ఢిల్లీ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఈ సభకు సంబంధించి మైదాన్‌ను మొత్తం 14 భద్రతా ప్రాంతాలుగా విభజించి, సుమారు 3,500 మంది పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు. అంతేకాకుండా, నిఘా కోసం 200 హై-డెఫినిషన్ సీసీటీవీ కెమెరాలతో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల కల్లా కచ్చితంగా ముగియాలని, ఆ తర్వాత మైదానంలో ఎవరూ ఉండరాదని స్పష్టం చేశారు. కేవలం రాంలీలా మైదాన్‌కు మాత్రమే సభను పరిమితం చేయాలని, బయట ఎలాంటి రోడ్ షోలు, పాదయాత్రలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. సభలో కుల, మత, వర్గ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తే నిర్వాహకులదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు.
ట్రాఫిక్ అంతరాయాలను నివారించేందుకు వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ప్రాంతాలను కేటాయించామని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే తక్షణమే అనుమతులు రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

