కలం, వెబ్ డెస్క్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ (Shamshabad Car Fire) ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ టాటా కారులో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వాహనం ప్రయాణంలో ఉండగానే ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా పొగలు, మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్, వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి కారును రోడ్డు పక్కకు నిలిపివేశాడు. డ్రైవర్ వెంటనే వాహనం నుంచి బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. కారులో ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.
ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు వాహనమంతటా వేగంగా వ్యాపించి, కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇంజిన్ వేడెక్కడం వల్ల జరిగిందా? అనే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

