గ్రామ ప్రగతికి సరికొత్త ప్రణాళిక.. మంత్రి సీతక్క కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ప్రథమంగా ప్రతి గ్రామపంచాయతీకి సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తూ పంచాయతీరాజ్ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న ఈ ‘గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక’ (GPSAP-2026) ద్వారా ఇకపై ప్రతీ గ్రామానికి స్పష్టమైన కార్యాచరణ అందనుంది. రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికి సంబంధించి జనాభా, కుటుంబాల స్థితిగతులు, ఉపాధి అవకాశాలు, గృహవసతి, పశుసంపదతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల అమలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో ప్రత్యేక ప్రొఫైల్‌ను తయారు చేయనున్నారు.

ఈ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పాటు, ప్రస్తుత ఏడాదికి ప్రత్యేక వార్షిక కార్యాచరణను రూపొందిస్తారు. స్థానిక ప్రజల అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగానే అభివృద్ధి పనులను ఎంపిక చేసి వివిధ శాఖల సమన్వయంతో ముందుకు తీసుకెళ్లనున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను, అభివృద్ధి పనుల పర్యవేక్షణ నిమిత్తం ప్రత్యేక డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రతినెలా జరిగే గ్రామపంచాయతీ సమావేశంలో ఈ జీపీఎస్‌ఏపీ ప్రగతిపై కూలంకషంగా సమీక్ష నిర్వహించనున్నారు. పంచాయతీ కార్యదర్శి స్థాయి నుంచి మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు ప్రతీ అధికారికి స్పష్టమైన బాధ్యతలను అప్పగించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, తప్పుడు సమాచారం అందించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాలను తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఈ ప్లాన్ అమలు కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>