కలం వెబ్ డెస్క్ : మండలిలో భావోద్వేగ ప్రసంగం అనంతరం ఎమ్మెల్సీ కవిత(Kavitha) సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో యువత కోసం గొప్ప రాజకీయ వేదిక రాబోతోందని కవిత ప్రకటించారు. భవిష్యత్తులో కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానన్నారు. తెలంగాణ అస్తిత్వం కోసం, ఆడబిడ్డల హక్కుల కోసం ముందడుగు వేస్తున్న తనను ఆశీర్వదించి, అండగా నిలబడి తనతో పాటు కలిసి నడవాలని కోరారు. ఇటీవల తండాల్లో గిరిజనుల కష్టాలు చూశానని, 12 ఏళ్లలో కోట్లు ఖర్చు చేసి ఏం సాధించామని ప్రశ్నించారు. తెలంగాణను తనలో నింపుకొని జాగృతి శక్తిగా ఎదుగుతుందని కవిత తెలిపారు.
“లక్ష్మీ నరసింహస్వామిపై ప్రమాణం చేసి చెప్తున్నా.. నా పోరాటం ఆస్తుల కోసం కాదు.. ఆత్మగౌరవం కోసమే” అని కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తనపై తలాతోక లేని ఆరోపణలు చేస్తున్నాయని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎవరూ ఆ చెత్త ఆరోపణలను పట్టించుకోకూడదని కోరారు. తల్లిలాంటి పార్టీ నుంచి అవమాన భారంతో అన్ని బంధాలు, బంధనాలు తెంచుకొని బయటకు వస్తున్నానని కవిత అన్నారు. తాను ఎవ్వరిపై ఆధారపడే వ్యక్తిని కాదని, ఎవ్వరినీ ఏదీ అడగనని చెప్పారు. అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదు
నైతికత లేని పార్టీ బీఆర్ఎస్ అని కవిత విమర్శించారు. ఆ పార్టీ రాజ్యాంగం ఒక జోక్ అని.. ఎనిమిది పేజీలు మాత్రమే ఉంటుందని కవిత ఎద్దేవా చేశారు. నైతికత లేని బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ కోసం కుటుంబాన్ని వదిలి కష్టపడ్డానని చెప్పారు. పార్టీ నుంచి తనను కుట్ర చేసి బయటకు పంపారని విమర్శించారు. తన మీద బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని.. ఆస్తుల కోసం తాను పోరాటం చేస్తున్నానని అంటున్నారని ఇదంతా కరెక్ట్ కాదని చెప్పారు. ‘లక్ష్మీ నరసింహా స్వామి మీద, నా పిల్లల మీద ఒట్టు. ఆత్మగౌరవం కోసమే నా పోరాటం.’ అంటూ కవిత పేర్కొన్నారు. ఓ వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నానని.. భవిష్యత్ లో శక్తిగా వస్తానంటు కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణలో కొత్త రాజకీయ పంథాను నిర్మిస్తానన్నారు. ‘ఒక ఆడబిడ్డగా ముందడుగు వేస్తున్నా. నన్ను ఆశీర్వదించండి.’ అంటూ కవిత పేర్కొన్నారు.

Read Also: బీఆర్ఎస్ తెలివి తక్కువ పనితో తెలంగాణకు భారీ నష్టం : ఉత్తమ్
Follow Us On: X(Twitter)


