కలం డెస్క్ : అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించడంతో సాగునీటి అంశాలపై చర్చలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మరో కీలకమైన పాలసీపై జరిగే చర్చను కూడా మిస్ అవుతున్నది. సాగునీటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాల వాటాను కోల్పోతున్నామని బీఆర్ఎస్ పోటీ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. అసెంబ్లీలో సోమవారం ‘హిల్ట్’ పాలసీపై (HILT Policy) చర్చ జరగనున్నట్లు కార్యదర్శి బులెటిన్‌లో పేర్కొన్నారు. కానీ ఈ సెషన్ మొత్తాన్ని బీఆర్ఎస్ బాయ్‌కాట్ చేయడంతో దీనిపై జరిగే చర్చలోనూ పాల్గొనే అవకాశాన్ని కోల్పోతున్నది. ఇదే పాలసీపై మండలిలోనూ చర్చ జరగనున్నది. అక్కడ కూడా బాయ్‌కాట్ కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం లేదు.
హిల్ట్ పాలసీని వ్యతిరేకించిన బీఆర్ఎస్ :
హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్ ట్రాన్సఫర్మేషన్ పాలసీ అధికారికంగా జీవో రూపంలో విడుదల కాకముందే బీఆర్ఎస్ నేతలకు ఈ కాపీ లీక్ అయింది. హిల్ట్ పేరుతో ప్రభుత్వం భారీ స్థాయిలో కుంభకోణానికి పాల్పడిందని, ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని కమిషన్ల రూపంలో కొల్లగొట్టడానికి ఈ పాలసీని రూపొందించిందని కేటీఆర్ ఆరోపించారు. చివరకు ఈ వ్యవహారం హైకోర్టుదాకా చేరింది. ఈ పాలసీపై కేటీఆర్ చేసిన విమర్శలకు పరిశ్రమల శాఖ మంత్రి ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఒకవైపు ఈ పాలసీని బీఆర్ఎస్ నేతలకు లీక్ చేసిందెవరని ప్రభుత్వం ఆరా తీసింది. ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అందులోని వివరాలు గోప్యంగానే ఉండిపోయాయి. పాలసీపై ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేసిన నేపథ్యంలో దీనిపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ పెట్టి వాస్తవాలను వివరించాలనుకుంటున్నది.
ఈ పాలసీపైనా బీఆర్ఎస్ కౌంటర్ మీటింగ్ :
హిల్ట్ పాలసీపై ప్రభుత్వం ఇచ్చే వివరణను కౌంటర్ చేసే విధంగా కేటీఆర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. సాగునీటి అంశాలపై హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లుగానే కేటీఆర్ కూడా ప్రభుత్వ పీపీటీకి కౌంటర్‌గా వివరించాలనుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. సాగునీటి అంశాలపై చర్చలో పాల్గొనకుండా బహిష్కరణ పేరుతో దూరంగా ఉండడం బీఆర్ఎస్‌కు నెగెటివ్ అయిందని ఇప్పటికే పార్టీలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా దీనికి కొనసాగింపుగా హిల్ట్ పాలసీపై చర్చకు కూడా బీఆర్ఎస్ గైర్హాజరు కావడం మరికొంత డ్యామేజ్ చేసినట్లయిందని, ప్రభుత్వ విధానాల్లోని లోపాలను, లొసుగులను చట్టసభ ద్వారా బహిర్గతం చేసే అవకాశాన్ని కోల్పోయినట్లయిందని గుర్తుచేశారు.
కౌన్సిల్‌లో కవిత పాల్గొంటారా?
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత రెండు రోజుల క్రితం కౌన్సిల్ చైర్మన్‌ను కలిసి ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాజీనామా చేయడానిక దారితీసిన కారణాలను స్వయంగా తానే సభకు హాజరై వివరిస్తానని ఆయనకు ప్రతిపాదించారు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోలేనని జనవరి 5వ తేదీ సెషన్ సందర్భంగా నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఆ ప్రకారం కల్వకుంట్ల కవిత సోమవారం జరిగే సెషన్‌కు హాజరుకానున్నారు. ఆమె తన రాజీనామా కారణాలను వివరించి సభ నుంచి బైటకు వచ్చేస్తారా?.. లేక ఆ రోజు జరిగే అన్ని చర్చల్లో పాల్గొంటారా?.. ఒకవేళ హిల్ట్ పాలసీపై చర్చ జరిగితే అందులో పాల్గొని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారా?.. ఇలాంటిది జరిగితే అది బీఆర్ఎస్‌కు మరింత డ్యామేజీగా మారుతుందా?.. ఇలాంటివన్నీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Read Also: ఛత్తీస్‌గఢ్‌లో కొత్త చరిత్ర లిఖించిన బడేసెట్టి గ్రామం
Follow Us On : WhatsApp


