కలం, వెబ్ డెస్క్: తొలి మావోయిస్టు రహిత గ్రామాన్ని (First Maoist Free Village) ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ప్రకటించింది. ఆ గ్రామంలో ఒకప్పుడు నిత్యం తుపాకీ మోతలే వినిపించేవి. అటు మావోయిస్టులు వచ్చినా.. ఇటు భద్రతా బలగాలు వచ్చినా అక్కడి ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడిపేవారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టాక మావోయిస్టులు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో మావోయిస్టుల పట్టు సడలిపోతుంది. అందులో భాగంగా దేశంలోనే తొలి మావోయిస్టు రహిత గ్రామంగా చత్తీస్‌గఢ్ రాష్ట్రం.. సుక్మా జిల్లాలోని బడేసెట్టి (Badesetti) గ్రామం నిలిచింది. ఒకప్పుడు మావోయిస్టుల భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన గ్రామం, అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన గ్రామం చాలా కాలం తర్వాత అభివృద్ధికి నోచుకోబోతున్నది.
ఈ గ్రామంలో ప్రస్తుతం శాంతి, అభివృద్ధి అనే పదాలు వినిపిస్తున్నాయి. చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు రహిత గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ‘ఇల్వాడ్ పంచాయతీ’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రూ. కోటి రూపాయలు మంజూరు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నారు. తాజా బడేసెట్టి గ్రామం ఈ పథకానికి ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామంలో రహదారులు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, విద్య వంటి మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ. కోటి నిధులు విడుదలయ్యాయి.
’ఇల్వాడ్ పంచాయతీ‘ లక్ష్యం ఏమిటి?
మావోయిస్టుల ప్రభావం నుంచి విముక్తి పొందిన గ్రామాలను వేగంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతో ఇల్వాడ్ పంచాయతీ పథకాన్ని అమలు చేస్తున్నట్టు బస్తర్ ఐజీ పీ సుందర్ రాజ్ పేర్కొన్నారు. గ్రామంలో విద్యుత్, రేషన్ షాపులు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గ్రామంలో మౌలిక వసతులు అమలు చేయడమే కాకుండా పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టించి ఇచ్చే పథకం, స్వచ్ఛ భారత్, స్వయం సహాయక సంఘాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఉపాధి హామీ పథకం వంటివి కూడా అమలు చేస్తున్నామని సుక్మా జిల్లా పంచాయతీ సీఈవో ముకుంద్ ఠాకూర్ వివరించారు.
బడేసెట్టి గ్రామం నక్సల్ రహిత గ్రామంగా ప్రకటించడం జిల్లా చరిత్రలో కీలక ఘట్టమన్నారు. గ్రామంలోని 80 శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. బస్తర్ ఒలింపిక్స్‌లో ఇక్కడి ప్రజలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది 10 వేల మంది పాల్గొనగా, ఈ ఏడాది ఆ సంఖ్య 40 వేలకు చేరిందని తెలిపారు. లొంగిపోయిన నక్సల్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వారిలో మార్పునకు నిదర్శనమని చెప్పారు.
అప్పట్లో పరిస్థితి భయానకం
బడేసెట్టి గ్రామ పంచాయతీ కార్యదర్శి పుణెం సుక్కా మాట్లాడుతూ.. తాను 2021లో బాధ్యతలు స్వీకరించినప్పుడు గ్రామంలో భయానకమై పరిస్థితి ఉండేదన్నారు. మోటార్‌సైకిళ్లు కూడా తిరగలేని పరిస్థితి ఉండేదని చెప్పారు. బయటి వ్యక్తులపై అనుమానంతో చూసేవారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. గ్రామానికి ముఖ్యమంత్రి సమగ్ర అభివృద్ధి పథకం కింద రూ.70 లక్షలు, డీఎంఎఫ్ నిధుల కింద రూ.30 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు.
సిమెంట్ రహదారులు, అంగన్‌వాడీ కేంద్రం, మార్కెట్ షెడ్, పాఠశాల, హాస్టల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. బడేసెట్టి గ్రామం సాధించిన ఈ మార్పును ఇతర నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోనూ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇది భయం నుంచి భరోసాకు, సంఘర్షణ నుంచి అభివృద్ధికి నాంది పలికిన ఉదాహరణగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.

Read Also: ఆ కంటెంట్, అకౌంట్స్ తొలగిస్తాం: ఎక్స్
Follow Us On: Sharechat


