కలం, వెబ్ డెస్క్ : తెలుగు భాష వైభవం ఖండాంతరాలు దాటింది. 2027 జనవరిలో జరగబోయే తదుపరి ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ (Mauritius) ఆతిథ్యం ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా ఈ చారిత్రక ప్రకటన వెలువడింది. ఈ మేరకు ఆంధ్ర సారస్వత పరిషత్ – మారిషస్ తెలగు మహాసభ అసోసియేషన్ల మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది.
ఆదివారం గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభలో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోఖూల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను ఒక ‘జీవంతమైన నాగరికత’గా అభివర్ణించారు. తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది అపారమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని తనలో నింపుకుందని కొనియాడారు. మారిషస్ (Mauritius) దేశాభివృద్ధిలో అక్కడి తెలుగు సమాజం ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన గుర్తుచేశారు.
మారిషస్‌లో ఏటా నవంబర్ 1న ‘ఆంధ్రప్రదేశ్ డే’ జరుపుకుంటామని, అక్కడ 108 అడుగుల శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం భక్తులకు కొలువై ఉందని గోఖూల్ తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలను కాపాడుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, బహుభాషా విద్యా విధానాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 50 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు హాజరైన ఈ సభలో, మారిషస్ తెలుగు మహాసభ ప్రతినిధులు 2027 సభలకు తెలుగు భాషా ప్రేమికులందరూ తరలిరావాలని ఆహ్వానించారు.


