కలం, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టుకు (Bhogapuram Airport) సంబంధించి ఆదివారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎయిర్‌పోర్టులో తొలి టెస్ట్ ఫ్లైట్‌ను ల్యాండ్ చేయనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) హాజరుకానున్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు రన్‌వేపై నేడు ఎయిర్ ఇండియా విమానం టెస్ట్ ల్యాండింగ్ చేయనుంది. రన్‌వే భద్రత, నావిగేషన్ వ్యవస్థలు, ల్యాండింగ్ సౌకర్యాల పనితీరును ఈ పరీక్షా విమానయానం ద్వారా పరిశీలించనున్నారు. విమాన ల్యాండింగ్ విజయవంతమైతే ఎయిర్‌పోర్టు ఆపరేషన్ల ప్రారంభానికి కీలక అడుగు పడినట్టే అవుతుంది.
ప్రస్తుతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు దాదాపు 92 శాతం పూర్తయ్యాయి. ముఖ్యంగా 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వే నిర్మాణం పూర్తికి చేరువలో ఉంది. ఈ రన్‌వేను బోయింగ్, ఎయిర్‌బస్ వంటి పెద్ద విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా రూపొందించారు. సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు.
దక్షిణ భారతంలోనే అత్యాధునిక సదుపాయాలతో కూడిన అంతర్జాతీయ విమానాశ్రయంగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. అన్ని పనులు నిర్ణీత కాలంలో పూర్తిచేసి జూన్ నెల నుంచి ప్రయాణికుల సేవలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రన్‌వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థల పనులను వేగంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి గణనీయమైన అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Read Also: రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 400 బైకులు దగ్దం
Follow Us On: X(Twitter)


